Puranapanda Srinivas: నేడు అభయ గణపతి ఆలయాలకు పురాణపండ శ్రీనివాస్ అఖండ పూజార్చనలు

Puranapanda Srinivas Performs Abhaya Ganapathi Temple Inauguration
  • జంట నగరాల్లో 21 అభయ గణపతి ఆలయాల నిర్మాణం
  • పవిత్రమైన కృష్ణ‌ శిలతో తమిళనాడులో తయారీ
  • త్యాగరాయగాన సభలోని అభయ గణపతికి నేడు పురాణపండ పూజార్చనలు
జంట నగరాలలో ఇరవై ఒక్క అభయ గణపతి ఆలయాల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అత్యంత అరుదైన కృష్ణశిలతో వివిధ ప్రాంతాల్లో నిర్మితమయ్యే ఈ ఆలయాలకు ప్రముఖ రచయిత, జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థాపకుడు పురాణపండ శ్రీనివాస్ ఆలయ నిర్మాణ పూజలు నిర్వహిస్తారు.

ఇరవై ఒక్క ఆలయాల్లో మొదటిగా హైదరాబాద్ త్యాగరాయ గానసభలో నిర్మితమైన అభయ గణపతి ఆలయానికి శృంగేరి పండితుల వైదిక మంత్ర శబ్దాల మధ్య పురాణపండ శ్రీనివాస్ నేడు (ఏప్రిల్ 4న) పూజార్చనలు నిర్వహిస్తారని త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి తెలిపారు. రెండున్నర అడుగుల ఎత్తు, వెడల్పుతో, అరుదైన పవిత్ర కృష్ణ శిలతో ఈ అభయ గణపతి శిల్పాన్ని తమిళనాడులో తయారు చేయించినట్టు చెప్పారు.

వందల, వేల కళాకారులకు, రచయితలకు, నాట్యకారిణులకు, గాయనీ, గాయకులకు ముఖద్వారంగా సుమారు ఆరు దశాబ్దాల కీర్తిని జాతీయ స్థాయిలో సంపాదించుకున్న త్యాగరాయ గానసభలో ఇలాంటి దైవీయ కార్యక్రమం నిర్వహించనుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఈర్ష్యాసూయలు, కపటం, కల్మషాలు మన దరికి చేరనివ్వద్దని ప్రతీ సభలో అద్భుతమైన కథలతో హెచ్చరించే పురాణపండ శ్రీనివాస్ మానవ విలువలకు పెద్దపీట వేస్తారు. భారతీయ వైదిక, ధార్మిక అంశాలకు చెందిన పరమసత్యాల గ్రంథాలతో దూసుకుపోతున్న పుస్తక మాంత్రికుడిగా పురాణపండ ఈ అభయ గణపతి మంగళ కార్యానికి హాజరు కావడం గణపతి భగవానుని విశేష అనుగ్రహంగా మేధో సమాజం పేర్కొనడం గమనార్హం. ఈ అభయగణపతి ప్రతిష్ఠాపనలో తమను ప్రోత్సహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య తదితరులకు జనార్ధనమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.
Puranapanda Srinivas
Abhaya Ganapathi Temple
Hyderabad
Krishna Sila
Temple Inauguration
Religious Ceremony
Tyagaraya Gana Sabha
K.V. Ramanachari
Bollineni Krishnaiah
Hindu Rituals

More Telugu News