Jagan Mohan Reddy: వక్ఫ్ బిల్లుపై వైసీపీ డబుల్ గేమ్ అంటూ టీడీపీ విమర్శల దాడి

YCPs Double Game on Waqf Bill TDPs Strong Criticism
  • లోక్‌సభలో బిల్లుకు వ్యతిరేకంగా, రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేసిందంటూ టీడీపీ విమర్శ
  • జగన్ తల్లిని, చెల్లినే కాదు .. ముస్లింలను కూడా మోసం చేశారంటూ నక్కా ఆనందబాబు విమర్శ 
  • ముస్లిం సమాజంపై వైసీపీ మోసపూరిత విధానం బయటపడిందన్న నాగుల్ మీరా
వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీ ద్వంద్వ ప్రమాణాలు అవలంబించిందని, ముస్లింలను నమ్మించి మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పార్లమెంటులో చెప్పించి, ఓటింగ్ సమయంలో లోక్‌సభలో వ్యతిరేకంగా ఓటు వేసి, రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేసి జగన్ ముస్లింలను మోసం చేశారని టీడీపీ దుయ్యబట్టింది.

వక్ఫ్ బిల్లుకు తాము వ్యతిరేకమని వైసీపీ నేతలతో మాట్లాడించిన జగన్, రాజ్యసభలో మాత్రం తన ఎంపీలను బిల్లుకు మద్దతుగా ఓటు వేయమని చెప్పారని టీడీపీ విమర్శించింది. ఇది ముస్లింలకు తెలిసి వారు షాక్ నుంచి తేరుకోకముందే విప్ జారీ అంటూ నాటకానికి తెరదీశారని మండిపడింది. చేసిందంతా చేసి ఓటింగ్ తర్వాత విప్ జారీ చేయడం ఏమిటని ముస్లింలు ప్రశ్నిస్తున్నారని టీడీపీ పేర్కొంది.

వైసీపీపై ఎక్స్ వేదికగా టీడీపీ ఈ అంశంపై విమర్శలు గుప్పించింది. టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద బాబు మీడియా సమావేశాల్లో వైసీపీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ, జగన్ తీరును తూర్పారబట్టారు.

జగన్ తల్లిని, చెల్లినే కాదని, ముస్లింలను కూడా మోసం చేశారని నక్కా ఆనందబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ రెడ్డి మాటలు ఒకలా ఉంటే చేతలు మరోలా ఉంటాయని నాగుల్ మీరా విమర్శించారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించిందని ఆయన విమర్శించారు. ముస్లిం సమాజంపై వైసీపీ మోసపూరిత విధానం బయటపడిందని ఆయన అన్నారు. 
Jagan Mohan Reddy
YCP
TDP
Waqf Bill
Muslim community
Andhra Pradesh Politics
Parliament
Lok Sabha
Rajya Sabha
Nagul Meera
Nakka Ananda Babu

More Telugu News