Muhammad Shabir: రూ. 50 వేలు డిమాండ్ చేస్తే రూ. 5 వేలు ఇచ్చిన పెళ్లికొడుకు.. పట్టుకొని కర్రలతో చితకబాదిన వధువు కుటుంబ సభ్యులు!

Groom Beaten After Joota Chupai Dispute in India
  • ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఘటన
  • ‘జూతా చుపాయి’లో భాగంగా చెప్పులు దాచిపెట్టిన వధువు వదిన
  • తిరిగి ఇచ్చేందుకు రూ. 50 వేల డిమాండ్
  • రూ. 5 వేలు ఇవ్వడంతో గదిలో బంధించి దాడి
పెళ్లి వేడుకలో ‘జూతా చుపాయి’ (చెప్పులు దాచిపెట్టడం) కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వధూవరుల కుటుంబాలు కలబడి కొట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జరిగిందీ ఘటన. దాచిపెట్టిన చెప్పులు ఇచ్చేందుకు రూ. 50 వేలు డిమాండ్ చేయగా, పెళ్లి కొడుకు రూ. 5 వేలు మాత్రమే ఇవ్వడంతో గొడవ ప్రారంభమైంది. వధువు తరపు మహిళ పెళ్లి కొడుకును బిచ్చగాడిగా అభివర్ణించడంతో గొడవ ముదిరింది. అంతేకాదు, పెళ్లికొడుకును ఓ గదిలో బంధించి వధువు తరపు బంధువులు కర్రలతో చితకబాదారు. 

వరుడు ముహమ్మద్ షాబిర్ శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరాఖండ్‌లోని చక్రట నుంచి ఊరేగింపుగా బిజ్నోర్ చేరుకున్నాడు. వివాహ ఆచారంలో భాగంగా వధువు వదిన వరుడు షాబిర్ బూట్లను దొంగిలించింది. వాటిని తిరిగి ఇచ్చేందుకు రూ. 50 వేలు డిమాండ్ చేసింది. అయితే, షాబిర్ మాత్రం రూ. 5 వేలు మాత్రమే ఇచ్చాడు. దీంతో వధువు కుటుంబంలోని మహిళలు పెళ్లి కొడుకును బిచ్చగాడిగా అభివర్ణించారు. 

దీంతో వధూవరుల కుటుంబల మధ్య వాగ్వివాదం మొదలైంది. ఆ వెంటనే అది ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వధువు కుటుంబ సభ్యులు వరుడు, అతడి కుటుంబ సభ్యులను ఓ గదిలో బంధించి కర్రలతో వారిని చితకబాదారు. 

అయితే, వధువు కుటుంబ సభ్యులు మాత్రం మరోలా చెబుతున్నారు. పెళ్లికొడుకు కుటుంబం పెట్టిన బంగారం నాణ్యతను ప్రశ్నించడంతో గొడవ మొదలైందని చెప్పారు. వారికి తమ కుమార్తె కంటే డబ్బులే ఎక్కువైపోయాయని ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాలను సముదాయించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు నజీబాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అయితే, ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 
Muhammad Shabir
Wedding Dispute
Juuta Chupai
Bijnor
Uttar Pradesh
India
Family Fight
Groom Beaten
Dowry Dispute
Indian Wedding Traditions

More Telugu News