Jagan Mohan Reddy: జగన్ ను లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోంది: గడికోట శ్రీకాంత్ రెడ్డి

Plot to Eliminate Jagan Gaddikotas Explosive Allegations
  • జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న జగన్ కు కనీస భద్రత కూడా కల్పించడం లేదన్న శ్రీకాంత్ రెడ్డి
  • జగన్ ఇంటి వద్ద కూడా సరైన భద్రత లేదని విమర్శ
  • జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారని అనితపై మండిపాటు
  • అన్యాయంగా పనిచేస్తున్న పోలీసుల గురించే జగన్ మాట్లాడారని వ్యాఖ్య
  • పలువురు ఐపీఎస్ లకు పోస్టింగ్ లు కూడా ఇవ్వలేదని విమర్శ
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను లేకుండా చేయాలని చూస్తున్నారంటూ ఆ పార్టీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ పర్యటనల్లో భద్రతా వైఫల్యాలు కనిపిస్తున్నాయని అన్నారు. జడ్ ప్లస్ రక్షణలో ఉన్న జగన్ కు కనీస భద్రత కూడా కల్పించడం లేదని విమర్శించారు. జగన్ ను లేకుండా చేయాలనే లక్ష్యంతో కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని అన్నారు. జగన్ ఇంటి దగ్గర కూడా సరైన భద్రతను కల్పించడం లేదని మండిపడ్డారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతపక్ష నేతగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్ ను చూడటం లేదని విమర్శించారు. 

జగన్ పర్యటనల గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మండలానికి ఒకరిని చంపితే కానీ భయం రాదనే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. 

అన్యాయంగా వ్యవహరిస్తున్న పోలీసుల గురించి మాత్రమే జగన్ మాట్లాడారని... నిజాయతీగా పనిచేసే పోలీసులకు తాము సెల్యూట్ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముగ్గురు డీజీ స్థాయి అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధిస్తున్నారని అన్నారు. పలువురు ఐపీఎస్ లకు పోస్టింగ్ లు ఇవ్వలేదని... దాదాపు 200 మంది పోలీసు అధికారులను వీఆర్ లో పెట్టారని మండిపడ్డారు. దీనిపై పోలీసు సంఘాల నేతలు మాట్లాడాలని అన్నారు. 

11 వందల మంది పోలీసులతో జగన్ పర్యటనకు భద్రత ఏర్పాటు చేశామని హోం మంత్రి అనిత చెప్పడం కరెక్ట్ కాదని చెప్పారు. మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అని అనిత అంటున్నారని... ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. డ్రామాలు చేయాల్సిన అవసరం తమకు లేదని... జగన్ వచ్చిన హెలికాప్టర్ ను జనాలు ఎలా చుట్టుముట్టారో చూడాలని చెప్పారు.
Jagan Mohan Reddy
Gaddikota Srikant Reddy
YCP
Andhra Pradesh Politics
Security Lapses
Police
Political Conspiracy
Home Minister Anitha
Z+ Security
AP Politics

More Telugu News