Purandeshwari: ముస్లింల ఓటు బ్యాంకు కోసం దుష్ప్రచారం చేస్తున్నారు: పురందేశ్వరి

Purandeshwari Accuses Congress of Spreading False Propaganda
  • అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తారని మోదీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారన్న పురందేశ్వరి
  • కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగానికి ఎక్కువ సార్లు సవరణలు జరిగాయని విమర్శ
  • అంబేద్కర్ ను గతంలో కాంగ్రెస్ అవమానించిందని మండిపాటు
ముస్లింల ఓటు బ్యాంకు కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తారంటూ మోదీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగానికి ఎక్కువ సార్లు సవరణలు జరిగాయని తెలిపారు. 

బీజేపీ హయాంలో 22 సార్లు సవరణలు చేశారని... ఇవన్నీ వివిధ వర్గాల అభ్యున్నతికి దోహదం చేసేవని చెప్పారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న బూత్ లెవెల్ లో పలు కార్యాక్రమాలను చేపడుతున్నామని పురందేశ్వరి వెల్లడించారు. అంబేద్కర్ కు సరైన గౌరవం ఇచ్చింది బీజేపీనే అని చెప్పారు. అంబేద్కర్ ను గతంలో అవమానించి ఆయన రాజీనామా చేసేలా చేసిన చరిత్ర ఎవరిదో అందరికీ తెలుసని అన్నారు. అంబేద్కర్ నివాసాన్ని అభివృద్ధి చేసింది కూడా బీజేపీనే అని చెప్పారు. 

భారత రాజ్యాంగం వల్లే బీసీ అయిన తాను ప్రధాని అయ్యానని మోదీ చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇలాంటి అంశాలపై పరిజ్ఞానం పెంచుకుని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, దయాకర్ రెడ్డి, గుడిసె దేవానంద్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు.
Purandeshwari
BJP
Congress
Modi government
Ambedkar Jayanti
Indian Constitution
Muslim vote bank
AP BJP chief
Somu Veeraju
Vijayawada

More Telugu News