Chandrababu Naidu: చంద్రబాబును కలిసిన ఆత్మకూరు ఎస్సీ కుటుంబాలు... అండగా ఉంటామని సీఎం భరోసా

Chandrababu Naidu Assures Support to Atmakuru SC Families
 
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, ఆత్మకూరు గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాల వారు సీఎం చంద్రబాబును కలిశారు. ఉండవల్లి నివాసంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో ఆదివారం సీఎంను కలిసి గత ప్రభుత్వ హయాంలో తాముపడ్డ కష్టాలను వివరించారు. 2019-24 మధ్య గ్రామంలోని 127 ఎస్సీ కుటుంబాలు వైసీపీ నేతల దాడులు, దౌర్జన్యాలకు గురయ్యాయని సీఎంకు వివరించారు. 

గ్రామాల్లో ఉండనివ్వకుండా నాటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతో వైసీపీ నేతలు తమను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఐదేళ్ల పాటు గ్రామాలు వదిలివెళ్లి తలదాచుకున్నామన్నారు. తాము ఊరిలో లేకపోవడంతో ఇళ్లు కూడా ధ్వంసం చేశారని వివరించారు. 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...పార్టీ కోసం పోరాడిన ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దాడికి ప్రతిదాడి చేయడం టీడీపీ సంస్కృతి కాదని, వైసీపీ బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. వైసీపీ నేతలు ధ్వంసం చేసిన ఇళ్లకు మరమ్మతులు చేయిస్తామని, ఇల్లు లేనివారికి స్థలం కేటాయించి ఇంటిని నిర్మించి ఇస్తామని చెప్పారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అయ్యే మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు. పాడి, పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు చేసి శాశ్వత జీవనోపాధి కల్పిస్తామని అన్నారు. చదువుకున్న యువకులకు శిక్షణ ద్వారా నైపుణ్యాలు పెంచి ఉద్యోగావకాశాలు పొందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. 

ఆత్మకూరు గ్రామంలోని ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆత్మకూరు గ్రామంలో తప్పకుండా పర్యటిస్తానని సీఎం అన్నారు. అనంతరం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసినందుకు ఎస్సీ కుటుంబాలు సీఎంకు ధన్యవాదాలు తెలిపాయి. 
Chandrababu Naidu
Atmakuru SC Families
YSRCP Atrocities
TDP Support
Palnadu District
Macharla Constituency
SC Caste
Andhra Pradesh Politics
Victim Families
Rehabilitation

More Telugu News