Anil Kumar Tiwari: భార్యను చంపి 20 ఏళ్లు తప్పించుకుని తిరిగాడు... ఎలాగంటే...!

Wife Murderer Anil Kumar Tiwari Arrested After 20 Years on the Run
  • భార్య హత్య కేసులో జీవిత ఖైదు పడ్డ మాజీ సైనికుడు
  • 2005లో పెరోల్‌పై విడుదలై పరారీ
  • 20 ఏళ్ల అనంతరం మధ్యప్రదేశ్‌లో పోలీసులకు చిక్కిన వైనం
  • మొబైల్ వాడకుండా,  కేవలం నగదు లావాదేవీలతో మేనేజ్ చేసిన వైనం 
  • పరారీలో ఉండగానే మరో పెళ్లి... నలుగురు పిల్లలు
భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ, పెరోల్‌పై విడుదలై తప్పించుకు తిరుగుతున్న మాజీ సైనికుడిని సుమారు 20 ఏళ్ల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. 2005లో పెరోల్‌పై బయటకు వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్న అనిల్ కుమార్ తివారీని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, అనిల్ కుమార్ తివారీ 1989లో తన భార్యను నిప్పంటించి హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించి 1989 మే 31న అతన్ని పోలీసులు అరెస్ట్ చేయగా, విచారణ అనంతరం కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. శిక్ష అనుభవిస్తున్న క్రమంలో, 2005 నవంబర్ 21న ఢిల్లీ హైకోర్టు అతనికి రెండు వారాల పెరోల్ మంజూరు చేసింది. అయితే, గడువు ముగిసినా తివారీ తిరిగి జైలుకు హాజరు కాలేదు. అప్పటి నుంచి పరారీలోనే ఉన్నాడు.

ఇటీవల ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బృందం సాంకేతిక, మానవ నిఘా ద్వారా తివారీ జాడను ప్రయాగ్‌రాజ్‌లో, ఆ తర్వాత అతని స్వగ్రామ పరిసరాల్లో గుర్తించింది. లభించిన సమాచారం ఆధారంగా, మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లా చుర్హట్ గ్రామంలో2025  ఏప్రిల్ 12న పోలీసులు నిందితుడు అనిల్ కుమార్ తివారీని అరెస్ట్ చేశారు.

పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకుని , తాను ఎప్పుడూ మొబైల్ ఫోన్ ఉపయోగించలేదని... నివాసం, పని ప్రదేశాలను నిరంతరం మార్చుకుంటూ ఉండేవాడినని విచారణలో తివారీ వెల్లడించాడు. డ్రైవర్‌గా పనిచేస్తూ, ఎటువంటి ఎలక్ట్రానిక్ ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు కేవలం నగదు లావాదేవీలనే జరిపేవాడని క్రైమ్ బ్రాంచ్ సీనియర్ అధికారి ఆదిత్య గౌతమ్ తెలిపారు. పరారీలో ఉన్న సమయంలోనే తివారీ మరో వివాహం చేసుకున్నాడని, ప్రస్తుతం అతనికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారని అధికారి వివరించారు.

అనిల్ తివారీ 1986లో భారత సైన్యంలోని ఆర్డినెన్స్ కార్ప్స్ యూనిట్‌లో డ్రైవర్‌గా చేరాడని, అయితే హత్య కేసులో కోర్టు దోషిగా నిర్ధారించడంతో అతన్ని సైన్యం నుంచి తొలగించారని మిస్టర్ గౌతమ్ పేర్కొన్నారు. నిందితుడి అరెస్ట్ గురించి సంబంధిత అధికారులకు సమాచారం అందించామని, కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
Anil Kumar Tiwari
Delhi Crime Branch
Murder Case
20-Year Fugitive
Parole Escape
Indian Army
Arrest in Madhya Pradesh
Sidhi District
Crime Investigation
Life Imprisonment

More Telugu News