Rekha Gupta: అలా చేస్తే పాఠశాలల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తాం: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హెచ్చరిక

Delhi CM Rekha Gupta Threatens School Registration Cancellation Over Fee Hike
  • ఏకపక్షంగా ఫీజులు పెంచడం, వేధించడాన్ని సహించేది లేదన్న ముఖ్యమంత్రి
  • యాజమాన్యాలు నియమ, నిబంధనలు పాటించాలని సూచన
  • ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తే నోటీసులు ఇస్తామన్న ముఖ్యమంత్రి
పాఠశాలల అధిక రుసుముల వసూళ్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్రంగా స్పందించారు. పాఠశాలల్లో ఏకపక్షంగా ఫీజులు పెంచితే ఉపేక్షించేది లేదని, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. పాఠశాలల్లో ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. మోడల్ టౌన్‌లోని క్వీన్ మేరీ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వేధింపులకు గురి చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం కొందరు విద్యార్థులను బహిష్కరించినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి రేఖా గుప్తా దృష్టికి తీసుకురావడంతో ఆమె వెంటనే స్పందించారు. పాఠశాలల్లో ఇష్టానుసారంగా ఫీజులు పెంచడం, విద్యార్థుల తల్లిదండ్రులను వేధించడం వంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఫీజుల పెంపు విషయంలో పాఠశాలల యాజమాన్యాలు కొన్ని నియమ, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అసాధరణంగా ఫీజులు పెంచరాదని, విద్యార్థులను అకారణంగా వేధించరాదని హితవు పలికారు.

నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తే సంబంధిత పాఠశాలలకు నోటీసులు పంపిస్తామని తెలిపారు. అవసరమైతే రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. పిల్లల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రతి బిడ్డకు న్యాయం, గౌరవం, సరైన విద్య లభించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుపై అధికారులు తక్షణమే స్పందించి దర్యాప్తు జరపాలని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
Rekha Gupta
Delhi Chief Minister
School Fees
School Registration Cancellation
Queen Mary School
Delhi School Fees Hike
Student Harassment
Education in Delhi
Parents Protest
Model Town Delhi

More Telugu News