Mamata Banerjee: బెంగాల్ హింస... మమతా బెనర్జీపై యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం

Mamata Banerjee Faces Yogi Adityanaths Ire Over West Bengal Violence
  • బెంగాల్ మంటల్లో మండిపోతుంటే మమతా బెనర్జీ మౌనంగా ఉన్నారని ఆగ్రహం
  • లౌకికవాదం పేరుతో బెంగాల్లో అల్లర్లను సృష్టించే వారికి స్వేచ్ఛ ఇచ్చారని ఆరోపణ
  • బెంగాల్లో ముఖ్యమంత్రి హింసను ప్రేరేపిస్తున్నారని కేంద్ర మంత్రి ఆగ్రహం
పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాలు అగ్నిగుండంగా మారుతున్నా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం వహించడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. లౌకికవాదం ముసుగులో బెంగాల్లో అల్లర్లు సృష్టించేవారికి ఆమె పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అరాచకాన్ని, హింసను అదుపు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

వక్ఫ్ సవరణ చట్టంపై రాష్ట్రంలో హింస చెలరేగుతున్నా మమతా బెనర్జీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ముర్షిదాబాద్ వారం రోజులుగా అగ్నికీలల్లో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను ఆమె శాంతిదూతలుగా భావిస్తున్నారని, కానీ హింసకు అలవాటుపడిన వారు ఆమె మాటలను పెడచెవిన పెడతారని అన్నారు. 

ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ నేతలు ఈ విధ్వంసంపై ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని యోగి ఆదిత్యనాథ్ నిలదీశారు.

కాగా... బెంగాల్‌లో ముఖ్యమంత్రే హింసను ప్రేరేపిస్తున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఆమోదించిన చట్టాన్ని బెంగాల్లో అమలు చేయబోమని మమతా బెనర్జీ చెప్పడం దారుణమని గుర్తు చేశారు.
Mamata Banerjee
Yogi Adityanath
West Bengal Violence
Murshidabad Violence
Wakf Amendment Act
Kiran Rijiju
Bengal Political Crisis
India Politics
West Bengal Riots

More Telugu News