BCCI: బీసీసీఐ కీల‌క‌ నిర్ణయం.. అభిషేక్‌ నాయర్‌, దిలీప్ తొల‌గింపు..?

BCCI Removes Abhishek Nayar and Dilip from Team India Support Staff
  • బీజీటీలో టీమిండియా పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న నేప‌థ్యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం
  • అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌, ట్రైనర్ సోహమ్ దేశాయ్‌ల‌పై వేటు
  • ఈ మేరకు 'దైనిక్ జాగరణ్' క‌థ‌నం 
  • ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌ని బీసీసీఐ
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ (బీజీటీ)లో టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా బీసీసీఐ కీల‌క‌ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. ఇందులో భాగంగా అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ను త‌ప్పిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌, ట్రైనర్ సోహమ్ దేశాయ్ ఇద్దరినీ ఇప్ప‌టికే వారి బాధ్యతల నుంచి తప్పించిన‌ట్లు 'దైనిక్ జాగరణ్' క‌థ‌నం పేర్కొంది. 

బ్యాటింగ్ కోచ్‌గా ఇప్ప‌టికే సితాన్షు కోట‌క్ ఉండ‌గా, అభిషేక్ నాయ‌ర్ అన‌వ‌స‌రం అనే భావ‌న‌లో బోర్డు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన అభిషేక్‌ నాయర్‌కు ఉద్వాసన పలకాలని బోర్డు నిర్ణయించినట్లు జాతీయ మీడియా నివేదిక పేర్కొంది. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు బీసీసీఐ మాత్రం ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. 

కాగా, ఎనిమిది నెలల కిందట గౌతమ్‌ గంభీర్ ప్ర‌ధాన‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అభిషేక్‌ నాయర్‌ను అసిస్టెంట్‌ కోచ్‌గా బీసీసీఐ నియమించిన విష‌యం తెలిసిందే. అభిషేక్‌, దిలీప్ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించకపోవడంతో అసిస్టెంట్ కోచ్ గా ఉన్న‌ ర్యాన్ టెన్ డెస్కాట్ ఇప్పుడు వారి బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించే అవ‌కాశం ఉంది. సోహమ్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లె రౌక్స్ ను తీసుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.  ఈయ‌న ప్రస్తుతం ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ట్రైనింగ్ స్టాఫ్ స‌భ్యుడిగా ఉన్నాడు.

ఇక ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌కు ముందు కొత్త సపోర్ట్ స్టాఫ్ టీమ్ ఇండియాలో చేరనున్నారు. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో టీమ్ ఇండియా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. 


BCCI
Abhishek Nayar
Dilip
Team India
Coaching Staff Changes
Border Gavaskar Trophy
Indian Cricket Team
Assistant Coach
Fielding Coach
Cricket News

More Telugu News