Yashaswini Reddy: ఇంట్రెస్ట్ ఉంటే అత్తాకోడళ్ల సీరియల్ చూపిస్తాం: ఎర్రబెల్లి దయాకరరావుపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆగ్రహం

Yashaswini Reddys Anger Erupts Against Errabelli Dayakar Rao
  • అత్తాకోడళ్ల సీరియళ్లు ఆసక్తిగా ఉంటాయన్న ఎర్రబెల్లి దయాకరరావు
  • అత్తాకోడళ్లు అని మాట్లాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరిక
  • అత్తాకోడళ్లు పార్టీని కాపాడకుంటూ పాలకుర్తిని అభివృద్ధి చేస్తున్నారని వ్యాఖ్య
మీకు అంత ఆసక్తి ఉంటే అత్తాకోడళ్ల సీరియల్ చూపిస్తామని, మరోసారి అత్తాకోడళ్లు గురించి మాట్లాడితే మర్యాద ఉండదని పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హెచ్చరించారు. అత్తాకోడళ్లు అంటే అంత చులకనా? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవాలని అన్నారు. అత్తాకోడళ్లు సీరియళ్లు చాలా ఆసక్తిగా ఉంటాయని ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.

నిత్యం అత్తాకోడళ్లు అని మాట్లాడుతున్నారని, అలాంటి వినోదం కావాలంటే అందరి ఇళ్లలో అత్తాకోడళ్ల సమాచారం తీసుకొచ్చి ఇస్తానని ఎర్రబెల్లిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నిత్యం తమను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని, కానీ తనకు ఎంత చెడు చేయాలని చూస్తే దేవుడు తనకు అంత మంచి చేస్తాడని అన్నారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులను తక్కువ అంచనా వేయవద్దని, తమ జోలికి వస్తే తరిమికొడతామని హెచ్చరించారు. ఎర్రబెల్లి తన వయస్సుతో పాటు హుందాతనాన్ని కాపాడుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. అమ్మాయి చిన్నది, సాఫ్టుగా ఉందని అనుకోవద్దని హెచ్చరించారు.

పాలకుర్తిని దోచుకుంది, దాచుకుంది బీఆర్ఎస్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలు చేసి ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. తాము ఆడోళ్లం మాత్రమే కాదని, ఆడ పులులం అని వ్యాఖ్యానించారు. తాము అత్తాకోడళ్లమే పార్టీని కాపాడుకుంటూ పాలకుర్తిని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

యశస్విని రెడ్డి పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే హనుమాండ్ల ఝాన్సీ కోడలు అని తెలిసిందే. యశస్విని రెడ్డి గత ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావుపై సంచలన విజయం సాధించారు.
Yashaswini Reddy
Errabelli Dayakar Rao
Palakurthi MLA
Telangana Politics
Congress
BRS
Political Feud
Telangana Elections
Women in Politics
MLA

More Telugu News