Mithun Reddy: హైకోర్టులో మిథున్ రెడ్డికి కొంత ఊరట, కొంత ఎదురుదెబ్బ

Mithun Reddy Gets Partial Relief Partial Setback in AP High Court
  • ఏపీ లిక్కర్ స్కామ్ కేసు
  • సిట్ విచారణకు మిథున్ తరపు న్యాయవాదులను అనుమతించిన హైకోర్టు
  • ఆడియో, వీడియో రికార్డింగ్ కు ఆదేశాలివ్వాలన్న అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం
ఏపీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో కొంత ఊరట, కొంత ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభంకోణం కేసుకు సంబంధించిన రేపు ఉదయం తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. 

ఈ క్రమంలో ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. తనను న్యాయవాదుల సమక్షంలో విచారించాలనే మిథున్ రెడ్డి విన్నపం పట్ల హైకోర్టు సానుకూలంగా స్పందించింది. విచారణ అధికారులు చేయి చేసుకుని, దుర్భాషలాడే ప్రమాదం ఉందని మిథున్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, విచారణ సమయంలో మిథున్ తరపు న్యాయవాదులను సిట్ కార్యాలయంలోకి అనుమతించాలని కోర్టు ఆదేశించింది. అయితే, విచారణకు న్యాయవాదులు ఆటంకం కలింగించవద్దని తెలిపింది. 

విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న మిథున్ రెడ్డి విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. సీసీటీవీలో కనిపించేలా విచారణ జరపాలని సిట్ ను ఆదేశించింది. ఆడియో, వీడియో రికార్డింగ్ కు అనుమతిని ఇవ్వలేమని పిటిషనర్ కు తెలిపింది. మిథున్ రెడ్డి రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ సీపీ కార్యాలయంలోని సిట్ కార్యాలయానికి రావాల్సి ఉంది.

మరోవైపు మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు ఇప్పటికే స్వల్ప ఊరటను కల్పించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించాలని మిథున్ రెడ్డిని ఆదేశించింది.
Mithun Reddy
AP Liquor Scam
YSRCP MP
Andhra Pradesh High Court
SIT Investigation
Vijayawada
Supreme Court
Arrest
Legal Case
AP Politics

More Telugu News