Jagdeep Dhankhar: రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు... 'అణు క్షిపణి' అంటూ ఉపరాష్ట్రపతి ఘాటు వ్యాఖ్యలు

Dhankhar Criticizes Supreme Courts Orders Calls Judiciary Nuclear Missile
  • ఇటీవల బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం తీర్పు
  • న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌  విమర్శలు
  • రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవని, ఆర్టికల్ 142 దుర్వినియోగమవుతోందని వ్యాఖ్య
  • ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో నగదు పట్టివేత కేసు దర్యాప్తు జాప్యంపై ప్రశ్నలు
  • న్యాయమూర్తులపై ఎఫ్ఐఆర్ నమోదుకు ప్రత్యేక విధానాన్ని తప్పుపట్టిన ఉపరాష్ట్రపతి
భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ న్యాయవ్యవస్థ పనితీరుపై, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన కొన్ని తీర్పులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, గవర్నర్‌లు బిల్లులను ఆమోదించడానికి సుప్రీంకోర్టు గడువు నిర్దేశించడాన్ని, అలాగే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో భారీ నగదు పట్టుబడిన ఘటనపై దర్యాప్తు జరుగుతున్న తీరును ఆయన బహిరంగంగా ప్రశ్నించారు.

రాజ్యసభ ఇంటర్న్‌ల ఆరవ బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ధన్‌ఖడ్‌, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, రాష్ట్రపతికి కోర్టులు ఆదేశాలు జారీ చేసే పరిస్థితి ఉండకూడదని అన్నారు. "రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, సంరక్షిస్తానని, కాపాడతానని ప్రమాణం చేసిన రాష్ట్రపతి అత్యంత ఉన్నత స్థానంలో ఉంటారు. అలాంటిది ఇటీవల ఒక తీర్పు ద్వారా రాష్ట్రపతికి ఆదేశాలు జారీ అయ్యాయి. మనం ఎటువైపు వెళుతున్నాం? దేశంలో ఏం జరుగుతోంది?" అని ప్రశ్నించారు. 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 (సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు) న్యాయవ్యవస్థ చేతిలో 24 గంటలూ అందుబాటులో ఉండే 'అణు క్షిపణి'గా మారిందని, ఇది ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఉందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులే చట్టాలు చేసే, కార్యనిర్వాహక విధులు నిర్వర్తించే, సూపర్ పార్లమెంటుగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడుతోందని, వారికి చట్టం వర్తించకపోవడంతో జవాబుదారీతనం లోపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

శాసనసభ రెండోసారి ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి లేదా గవర్నర్ నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే అవి చట్టాలుగా పరిగణించబడతాయని సుప్రీంకోర్టు తమిళనాడు కేసులో ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి విధులు కూడా ఆర్టికల్ 201 ప్రకారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని ఆ తీర్పులో ధర్మాసనం పేర్కొంది.

మార్చి 14-15 తేదీల్లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో భారీగా నగదు పట్టుబడిన ఘటనను కూడా ధంకర్ ప్రస్తావించారు. ఈ ఘటన మార్చి 21న ఒక పత్రిక కథనంతో గానీ వెలుగులోకి రాలేదని, ఈ జాప్యం ఆమోదయోగ్యమేనా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నుంచి అధికారిక సమాచారం వచ్చిందని, అది తప్పు జరిగిందనే సూచనలు ఇచ్చిందని, విచారణ అవసరాన్ని నొక్కి చెప్పిందని అన్నారు. అయితే, నెల రోజులు గడిచినా ఈ కేసులో పురోగతి లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 

"ఈ దేశంలో ఎవరిపైనైనా, నాతో సహా ఏ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపైనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. కానీ న్యాయమూర్తుల విషయంలో మాత్రం నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేని పరిస్థితి ఉంది" అని ధన్‌ఖడ్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం విచారణ నుంచి మినహాయింపు కేవలం రాష్ట్రపతి, గవర్నర్లకు మాత్రమే ఉందని, న్యాయమూర్తులకు ఈ రక్షణ ఎలా లభించిందని ఆయన ప్రశ్నించారు. "ఈ ఘటన నా ఇంట్లో జరిగి ఉంటే, దర్యాప్తు రాకెట్ వేగంతో జరిగేది. కానీ ఇప్పుడు కనీసం ఎడ్లబండి వేగంతో కూడా సాగడం లేదు" అని ధన్‌ఖడ్‌ వ్యాఖ్యానించారు.


Jagdeep Dhankhar
Supreme Court of India
Indian Judiciary
Constitutional Crisis
Article 142
Article 201
Delhi High Court Judge
Cash Seizure
Presidential Powers
Nuclear Missile Analogy

More Telugu News