Jr NTR: ఈ పోరాటంలో జూనియర్ ఎన్టీఆర్ కలిసి రాకుంటే ఇంటిని ముట్టడించాలి: విశారదన్ మహారాజ్

Jr NTR Criticized for Not Supporting Tribal Land Rights
  • కొమురం భీమ్ మీద చిత్రం తీసి చిత్ర పరిశ్రమ రూ. 2 వేల కోట్లు కొల్లగొట్టిందని వ్యాఖ్య
  • జూ. ఎన్టీఆర్ నిజ జీవితంలోనూ భూమి పోరాటంలో పాలు పంచుకోవాలని సూచన
  • నిజమైన హీరోవా లేదా తెర మీద మాత్రమే హీరోవా అని నిలదీత
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) అధినేత విశారదన్ మహారాజ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, కొమురం భీమ్ ఆనాడు బాణాలు, తుపాకులతో పోరాటం చేశారని, కానీ ఇప్పుడు మన ఆయుధం రాజ్యంగమేనని అన్నారు.

ఈ మధ్య కొమురం భీమ్ పాత్రతో ఓ చిత్రం వచ్చిందని, అందులో జూనియర్ ఎన్టీఆర్ నటించారని గుర్తు చేశారు. ఆ చిత్రంలో పేదల భూముల హక్కుల గురించి, కొమురం భీమ్ పాత్ర గురించి చెప్పారని, దీని ద్వారా చిత్ర పరిశ్రమ వారు పేదల వద్ద నుంచి రూ. 2000 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. సినిమాలో కొమురం భీమ్‌లా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ నిజ జీవితంలోనూ భూమి పోరాటంలో భాగం పంచుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ నిజమైన హీరోనా? లేక తెర మీద మాత్రమే హీరోనా? అని ప్రశ్నించారు. నిజమైన హీరో అయితే ఆదివాసీల యుద్ధంలో పాల్గొనాలని అన్నారు. ఈ పోరాటంలో జూనియర్ ఎన్టీఆర్ కలిసి రాకపోతే అవసరమైతే ఆయన ఇంటిని ముట్టడి కూడా చేయాలని అన్నారు.

ఆదివాసీల భూపోరాట కథ చెప్పి కోట్లాది రూపాయలు తీసుకున్నందుకు ఈ పోరాటంలో పాలుపంచుకోవాలని కోరారు. తమిళనాడులో సినిమా నటులు చిత్రాలలో నటిస్తూనే ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తారని, కానీ తెలుగు నటులు మాత్రం సినిమాల్లోనే హీరోలుగా నటిస్తారని విమర్శించారు.
Jr NTR
Visaradan Maharaj
Dharm Samaj Party
Komuram Bheem
Tribal Land Rights
Telugu Cinema
Adivasi Struggle
Land Protest
India Politics
NTR House Siege Threat

More Telugu News