Kavitha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ

Kavithas Open Letter to Telangana CM Revanth Reddy on Group1 Exam Irregularities
  • గ్రూప్-1 పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్
  • నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయని ఆరోపణ
  • పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయని వెల్లడి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 పరీక్షలను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయని ఆరోపించారు.

గ్రూప్-1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్ టిక్కెట్ నెంబర్ల కేటాయింపుతో గందరగోళం నెలకొందని అన్నారు. మెయిన్స్‌కు 21,075 మంది హాజరు కాగా, ఫలితాలు ప్రకటించేసరికి 10 మంది అభ్యర్థులు పెరిగారని, ఈ సంఖ్య ఎలా పెరిగిందని ప్రశ్నించారు. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినప్పటికీ అభ్యర్థుల హాజరు విషయంలో వ్యత్యాసం ఉందని అన్నారు.

అందరు అభ్యర్థులు నిజంగా పరీక్షకు హాజరయ్యారా లేదా వారిని మధ్యలో చేర్చారా అని నిలదీశారు. మూల్యాంకనం పైనా సందేహాలు ఉన్నాయని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల అధ్యాపకులతో వాల్యుయేషన్ చేయిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించినప్పటికీ, విశ్రాంత అధ్యాపకులతో చేయించారని ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా 45 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన టీజీపీఎస్సీ, ఆ తర్వాత ఒక కేంద్రాన్ని పెంచిందని గుర్తు చేశారు. రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగిందని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆ రెండు పరీక్ష కేంద్రాల్లోని 71 మంది ఉద్యోగాలకు ఎంపికైనది నిజమేనని టీజీపీఎస్సీ కూడా అంగీకరించిందని వెల్లడించారు. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో హైకోర్టు నియామక ప్రక్రియకు బ్రేక్ వేసిందని గుర్తు చేశారు.
Kavitha
Revanth Reddy
Telangana Group-1 Exams
TSPSC
Exam irregularities
Transparency
Accountability
Unemployed
Coaching Centers
High Court

More Telugu News