KA Paul: దైవ జనులారా మోసపోవద్దు అంటూ... చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన కేఏ పాల్

KA Paul Accuses Chandrababu Naidu of Deceiving Christians
  • 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం
  • మిగిలిన 80 వేల మంది పాస్టర్ల సంగతి ఏమిటని ప్రశ్నించిన కేఏ పాల్
  • హిందువులను క్రైస్తవులుగా మారుస్తున్నారని గతంలో చంద్రబాబు అన్నారని మండిపాటు
రాష్ట్రంలోని 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు రూ. 5 వేల చొప్పున గౌరవ వేతనాన్ని ఇవ్వనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. 

8 వేల మంది పాస్టర్లకు నెలకు రూ. 5 వేల గౌరవ వేతనాన్ని ఇస్తామని గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రకటించారని... గౌరవ వేతనాన్ని ఇంతకు ముందు ఇవ్వకుండా, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని చంద్రబాబును కేఏ పాల్ డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ ది హత్య అంటూ కోట్ల మంది క్రిస్టియన్లు, హిందువులు, ముస్లింలు ముందుకు రావడంతో... పాస్టర్ల ద్వారా వారి నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. 

హిందువులను క్రైస్తవులుగా మారుస్తున్నారని గతంలో చంద్రబాబు అన్నారని... ఆ తర్వాత పవన్ కల్యాణ్ కూడా అదే మాట మాట్లాడారని పాల్ మండిపడ్డారు. 8 వేల మంది పాస్టర్లకు మాత్రమే గౌరవ వేతనం ఇస్తే... మిగిలిన 80 వేల మంది పాస్టర్ల సంగతి ఏమిటని ప్రశ్నించారు. వేలాది మంది ముస్లిం మౌలానాలు, హిందూ అర్చకుల సంగతి ఏమిటని అడిగారు. 

దైవ జనులారా మనం ఎవరూ మోసపోకూడదని పాల్ అన్నారు. లక్ష రూపాయలు కూడా లేని వ్యక్తి లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మనం అమ్ముడు పోకూడదని అన్నారు. అందరం కలిసి పోరాడి మన పార్టీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
KA Paul
Chandrababu Naidu
AP Government
Pastor's Salary
Christian Pastors
Religious Discrimination
Good Friday
Andhra Pradesh Politics
Praja Shanti Party
Pawan Kalyan

More Telugu News