Anvesh: గోవింద బెట్టింగ్ యాప్ పై యూట్యూబర్ అన్వేష్ విజ్ఞప్తి... స్పందించిన నారా లోకేశ్

Anveshs Plea Against Govinda Betting App Nara Lokesh Responds
  • గోవింద బెట్టింగ్ యాప్ కు ఇప్పటికీ సినీ తారలు ప్రచారం చేస్తున్నారన్న అన్వేష్
  • డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ లను ఉద్దేశించి ట్వీట్
  • బెట్టింగ్ యాప్ లు జీవితాలను నాశనం చేస్తున్నాయన్న లోకేశ్
  • దీర్ఘకాలిక పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని వెల్లడి
పవిత్రమైన వెంకటేశ్వరస్వామి పేరుతో గోవింద అనే బెట్టింగ్ యాప్ కు గత కొన్నేళ్లుగా సినీ తారలు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికీ ఆ యాప్ నడుస్తోందని ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ల దృష్టికి తీసుకువచ్చారు. అన్వేష్ ఆ బెట్టింగ్ యాప్ కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సహా ట్వీట్ చేశారు. అమాయక యువతను ఇలాంటి బెట్టింగ్ యాప్ ల నుంచి కాపాడాలని పవన్, లోకేశ్ లకు విజ్ఞప్తి చేశారు. 

అన్వేష్ ట్వీట్ పై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. బెట్టింగ్ యాప్ లు జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా గ్యాంబ్లింగ్ కు బానిసైన యువత తమ జీవితాలను పతనం చేసుకుంటున్నారని వందల కొద్దీ వార్తలు విన్నానని వెల్లడించారు. దీనికి ముగింపు పలకాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఇటువంటి యాప్స్ పై నిరంతర అవగాహన కల్పించడం, వాటిపై కఠిన చర్యలు తీసుకోవడమే దీర్ఘకాలిక పరిష్కారం అని స్పష్టం చేశారు. 

దేశం మొత్తానికీ ఉదాహరణలా నిలిచేలా ఓ సమగ్రమైన బెట్టింగ్ యాప్స్ వ్యతిరేక విధానం తీసుకువచ్చేందుకు తాము కృషి చేస్తున్నామని లోకేశ్ వెల్లడించారు. ఈ బెట్టింగ్ యాప్స్ ముప్నును అంతమొందించడానికి అన్ని న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు.
Anvesh
Nara Lokesh
Govinda Betting App
Online Betting
Gambling Addiction
Youth
Andhra Pradesh
Pawan Kalyan
Illegal Betting Apps
Social Media Campaign

More Telugu News