Revanth Reddy: రేవంత్ రెడ్డి 'యంగ్ ఇండియా' బ్రాండ్‌కు బండి సంజయ్ కౌంటర్

Revanth Reddys Young India Brand Faces Counter from Bandi Sanjay
  • యంగ్ ఇండియా పేరుతో నెహ్రూ కుటుంబం రూ. 2 వేల కోట్లు దోచుకుందని ఆరోపణ
  • రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ పేరుతో రూ. 50 వేల కోట్ల దోపిడీకి కుట్ర చేశారని విమర్శలు
  • ఓ బ్రాండ్ కావాలనుకుంటే దాని పూర్వాపరాలు తెలుసుకోవాలన్న బండి సంజయ్
తన బ్రాండ్ 'యంగ్ ఇండియా' అన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో కూడా యంగ్ ఇండియా అని అంటున్నారని, ఆయనకు స్ఫూర్తి కూడా 'యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' అని చెబుతున్నారని విమర్శించారు.

యంగ్ ఇండియా పేరుతో నెహ్రూ కుటుంబం రూ. 2 వేల కోట్లు దోచుకున్నారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ పేరుతో రూ. 50 వేల కోట్ల దోపిడీకి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఇక్కడి పేదల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో నెహ్రూ కుటుంబం కూడా అదే పేరుతో కొల్లగొట్టిందని అన్నారు.

ఎవరైనా ఓ బ్రాండ్ కావాలనుకున్నప్పుడు గతంలో ఆ బ్రాండ్‌కు ఉన్న పూర్వాపరాలు, పరపతి ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. కానీ అవినీతి, అక్రమాలకు పాల్పడిన బ్రాండ్ పేరుతో ముందుకు వస్తే ప్రజలకు గతంలో చేసిన అక్రమాలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. 2011లో యూపీఏ ప్రభుత్వం హయాంలోనే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైందని గుర్తు చేశారు. కేసు నమోదైన సమయంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్ పొందారని తెలిపారు. కాబట్టి ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి భారతీయ చట్టాలు వర్తించవా అని నిలదీశారు.

వక్ఫ్ సవరణ బిల్లుపై బెంగాల్ తరహా ఆందోళనలు

వక్ఫ్ సవరణ బిల్లుపై తెలంగాణలోనూ బెంగాల్ తరహా ఆందోళనలకు అవకాశం ఉందని బండి సంజయ్ హెచ్చరించారు. నిరసనలు హద్దులు దాటితే హింసకు దారితీస్తాయని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Revanth Reddy
Bandi Sanjay
Young India
Telangana Politics
National Herald Case
BJP
Congress
Fourth City
Corruption Allegations
Wakf Amendment Bill

More Telugu News