Donald Trump: ట్రంప్ హయాంలో వందల వీసాలు రద్దు.. బాధితుల్లో సగం మంది భారత విద్యార్థులే!

Shock for Indian Students in US 50 Face Visa Cancellation
  • వందలాదిమంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దు
  • వీసాలు రద్దయిన వారిలో దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు కూడా
  • 14 శాతం మంది చైనా విద్యార్థుల వీసాలు రద్దు
  • తమను స్వదేశాలకు పంపకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టులను ఆశ్రయించిన విద్యార్థులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాల కారణంగా అమెరికాలో వందలాది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దయ్యాయి. వీరిలో సగం మంది భారతీయులేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్ఏ) వెల్లడించింది.

అది అందించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 327 మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. లేదా, వారి స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎస్ఈవీఐఎస్) రికార్డులు తొలగించబడ్డాయి. వీరిలో 50 శాతం మంది భారతీయులే కాగా, 14 శాతం మంది చైనాకు చెందినవారు ఉన్నారు. దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఈ వీసా రద్దులు సమర్థనీయంగా లేవని, వీటిపై పారదర్శకత, పర్యవేక్షణ, బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా తప్పుగా తొలగించిన ఎస్ఈవీఐఎస్ రికార్డులపై విద్యార్థులకు అర్జీ వేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఏఐఎల్ఏ కోరింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ వీసా రద్దుల నేపథ్యంలో చాలామంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో కోర్టులను ఆశ్రయించారు. వీసాలు రద్దయిన విద్యార్థులను వారి స్వదేశాలకు పంపించకుండా నిలుపుదల ఆదేశాలివ్వాలంటూ న్యాయమూర్తులను అభ్యర్థించారు. మాసాచుసెట్స్, మోంటానా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, వాషింగ్టన్ డీసీ రాష్ట్రాల్లోని న్యాయమూర్తులు అత్యవసరంగా విద్యార్థుల పరిరక్షణకు ఆదేశాలు జారీ చేశారు.

వీసా రద్దయిన విద్యార్థుల్లో భారతదేశానికి చెందిన క్రిష్ ఇస్సర్‌దాసాని అనే 21 ఏళ్ల యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మెడిసన్‌కి చెందిన అండర్‌ గ్రాడ్యుయేట్ విద్యార్థి కూడా ఉన్నాడు. నవంబర్‌లో ఓ బార్‌ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో జరిగిన వాగ్వివాదం నేపథ్యంలో అతడిని ‘డిసార్డర్‌‌లీ కండక్ట్‌’ ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. అయితే స్థానిక డిస్ట్రిక్ట్ అటార్నీ అతడిపై కేసు పెట్టనప్పటికీ, ఏప్రిల్ 4న యూనివర్సిటీ అతడి ఎస్ఈవీఐఎస్ రికార్డును రద్దు చేసింది. ఈ చర్య చట్టవిరుద్ధమని విస్కాన్సిన్‌లోని ఫెడరల్ న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Donald Trump
Indian Students
US Visa Cancellation
Student Visas
SEVIS Records
American Immigration Lawyers Association
Krish Issardasani
University of Wisconsin-Madison
International Students
US Immigration

More Telugu News