Babesh Chandra: బంగ్లాదేశ్ లో మరో ఘోరం.. హిందూ నేత దారుణ హత్య

Bangladesh Hindu Leader Babesh Chandra Kidnapped and Murdered
  • బంగ్లాదేశ్ లో హిందువులపై కొనసాగుతున్న దాడులు
  • తాజాగా బంగ్లాదేశ్ పూజా ఉద్జపన్ పరిషత్ నేత బాబేశ్ చంద్ర దారుణ హత్య
  • గురువారం చంద్రను కిడ్నాప్ చేసిన నలుగురు దుండగులు
హిందువులు, మైనార్టీలపై దాడులతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. నానాటికీ అక్కడి పరిస్థితి దిగజారుతోంది. తాజాగా బంగ్లాలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఒక హిందూ నేతను కిడ్నాప్ చేసిన ముష్కరులు ఆయనను కొట్టి చంపేశారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. 

బాబేశ్ చంద్ర అనే వ్యక్తికి బంగ్లాదేశ్ లోని హిందూ సమాజంలో మంచి గుర్తింపు ఉంది. బంగ్లాదేశ్ పూజా ఉద్జపన్ పరిషత్ కు చెందిన బిరాల్ యూనిట్ కు ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. దినాజ్ పూర్ లో ఉంటున్న ఆయనను కిడ్నాప్ చేసిన దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఆయన హత్యకు గురయ్యారనే విషయాన్ని స్థానిక పోలీసులు, కుటుంబ సభ్యులు నిర్ధారించారు. 

బంగ్లాదేశ్ లోని ప్రముఖ దినపత్రిక డైలీ స్టార్ తో చంద్ర భార్య శాంతన మాట్లాడుతూ... గురువారంనాడు రెండు బైకులపై నలుగురు వ్యక్తులు తమ ఇంటి వద్దకు వచ్చి తన భర్తను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తెలిపారు. చంద్రను నారాబరి గ్రామానికి తీసుకెళ్లారని పలువురు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అక్కడే చంద్రను అత్యంత దారుణంగా కొట్టారు. 

ఆ మరుసటి రోజు చలనం లేని చంద్ర శరీరాన్ని ముష్కరులు ఆయన ఇంటి వద్ద పడేసి వెళ్లిపోయారు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా... ఆయన అప్పటికే చనిపోయారని వైద్యులు ప్రకటించారు. స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ... ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. కేసు నమోదు చేసే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.
Babesh Chandra
Bangladesh Hindu Leader Murder
Bangladesh Minority Violence
Dinajpur Kidnapping
Hindu Minority Rights Bangladesh
Bangladesh Crime News
Religious Violence Bangladesh
Babesh Chandra Death
Bangladesh Puja Udjapan Parishad

More Telugu News