Abhinav Shukla: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మ‌రో బాలీవుడ్ హీరోకు బెదిరింపులు!

Bollywood Actor Abhinav Shukla Receives Death Threats from Lawrence Bishnoi Gang
  • గ‌త కొంత‌కాలంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి స‌ల్మాన్‌కు వ‌రుస బెదిరింపులు
  • తాజాగా ఈ గ్యాంగ్ నుంచి హీరో అభిన‌వ్ శుక్లాకు కూడా హ‌త్య బెదిరింపులు 
  • త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ పోలీసుల‌కు న‌టుడి విజ్ఞ‌ప్తి
బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కు గ‌త కొంత‌కాలంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వ‌రుస బెదిరింపులు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా ఈ గ్యాంగ్ నుంచి మ‌రో బాలీవుడ్ హీరో అభిన‌వ్ శుక్లాకు సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌త్య బెదిరింపులు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే తెలియ‌జేశారు. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ పోలీసుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు హ‌త్య బెదిరింపులు పంపిన అనుమానిత వ్య‌క్తి వివ‌రాల‌ను ఎక్స్ (ట్విట్ట‌ర్‌) పోస్టులో అభిన‌వ్ షేర్‌ చేశారు. ఈ పోస్టును పంజాబ్‌, చండీగ‌ఢ్ పోలీసుల‌కు ట్యాగ్ చేశారు. 

అభిన‌వ్ శుక్లా ఎక్స్ పోస్ట్ ప్ర‌కారం... అత‌డి సోష‌ల్ మీడియా ఖాతాకు ఒక వ్య‌క్తి నుంచి మెసేజ్ వ‌చ్చింది. అందులో "నేను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స‌భ్యుడిని. నాకు మీ ఇంటి చిరునామా తెలుసు. ఇటీవ‌ల స‌ల్లూ భాయ్ ఇంటిపై కాల్పులు జ‌రిపిన‌ట్లే మీ ఇంటిపై కూడా జ‌రుపుతాం. అసిమ్ గురించి గౌర‌వంగా మాట్లాడండి. లేదంటే బిష్ణోయ్ గ్యాంగ్ జాబితాలో మీ పేరు కూడా చేరుతుంది" అని ఉంది. 

త‌న‌తోపాటు త‌న కుటుంబ స‌భ్యుల‌కు, భ‌ద్ర‌తా సిబ్బందికి కూడా ఇదే మాదిరి బెదిరింపులు వ‌చ్చాయ‌ని ఆయ‌న తెలిపారు. ఆ సందేశం పంపిన వ్య‌క్తి ఇన్‌స్టాగ్రామ్ వివ‌రాల‌ను త‌న ఎక్స్ పోస్టులో తెలియ‌జేశారు. అత‌డి నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని పోలీసుల‌ను విజ్ఞ‌ప్తి చేశారు. 

కాగా, ఇటీవ‌ల అభిన‌వ్ అర్ధాంగి రుబీనాకు బిగ్‌బాస్ కంటెస్టెంట్ అసిమ్ రియాజ్‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఇది మ‌రింత ముద‌ర‌డంతో అసిమ్‌పై అభిన‌వ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అసిమ్ ఫ్యాన్స్ ఈ హీరోకు బెదిరింపు సందేశాలు పంపుతున్నారు. తాజాగా వ‌చ్చిన మెసేజ్ కూడా అత‌డి ఫ్యాన్సే పంపిన‌ట్లు అభిన‌వ్ ఆరోపించారు.  
Abhinav Shukla
Lawrence Bishnoi Gang
Bollywood Actor
Threat
Social Media Threat
Death Threat
Salman Khan
Asim Riaz
Rubina Dilaik
Bigg Boss

More Telugu News