Bandi Sanjay: మయన్మార్‌లో సైబర్ క్రైమ్ వెట్టిచాకిరి.. బండి సంజయ్ చొరవతో స్వదేశానికి తెలంగాణ, ఏపీ యువకులు

Bandi Sanjays Intervention Saves Telugu Victims of Myanmar Cyber Crime
  • బ్యాంకాక్‌లో ఉద్యోగాల పేరిట మయన్మార్‌కు తరలింపు
  • నలుగురు తెలుగు యువకులను సైబర్ నేరాలు చేయాలంటూ నిర్బంధం
  • బాధితుల కుటుంబ సభ్యుల అభ్యర్థనతో బండి సంజయ్ జోక్యం
  • విదేశాంగ శాఖ సమన్వయంతో స్వదేశానికి చేరిన బాధితులు
బ్యాంకాక్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మయన్మార్‌లో సైబర్ ఉచ్చులో చిక్కుకుపోయిన ముగ్గురు తెలంగాణ వాసులు, ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్వదేశానికి రప్పించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఆయన చొరవ తీసుకుని వీరిని భారత్‌కు రప్పించారు. కేంద్ర మంత్రి చొరవతో మయన్మార్‌లో 'సైబర్ క్రైమ్' వెట్టిచాకిరికి గురవుతున్న వారికి విముక్తి లభించింది.

బండి సంజయ్ చొరవతో స్వదేశానికి చేరుకున్న బాధితుల్లో రంగారెడ్డి జిల్లా కోహెడకు చెందిన రాకేష్ రెడ్డి, ఏ. శివశంకర్, కరీంనగర్ జిల్లాకు చెందిన కానూరి గణేశ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆకుల గురు యువ కిశోర్ ఉన్నారు.

వివరాల్లోకి వెళితే, అధిక వేతనాలతో బ్యాంకాక్‌లో ఉద్యోగాలంటూ కొందరు బ్రోకర్లు ఈ యువకులను నమ్మించారు. తీరా వారిని మయన్మార్‌కు తరలించి, అక్కడ సైబర్ మోసాలు చేసేందుకు బలవంతం చేశారు. రోజుకు 16 గంటల పాటు పనిచేయించుకుంటూ, ఎదురు తిరిగితే చిత్రహింసలకు గురిచేసేవారని బాధితులు వాపోయారు.

కోహెడకు చెందిన రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ, తమను జగిత్యాలకు చెందిన వంశీకృష్ణ అనే ఏజెంట్ మోసం చేశాడని చెప్పారు. అక్కడకు వెళ్లాక పని చేయనన్నందుకు తన పాస్‌పోర్ట్ లాక్కుని, ఆహారం కూడా పెట్టకుండా హింసించారని, చివరకు దొంగలుగా చిత్రీకరించి అక్కడి ఆర్మీకి అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

తనలాంటి బాధితులను బండి సంజయ్ చాలామందిని రక్షించారని తెలుసుకుని, తన తండ్రి ద్వారా కేంద్ర మంత్రి కార్యాలయాన్ని సంప్రదించామని రాకేశ్ రెడ్డి తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే బండి సంజయ్ స్పందించి, విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేసి తమను విడిపించేందుకు చర్యలు తీసుకున్నారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, ఇంకా అనేక మంది తెలుగు రాష్ట్రాల యువతతో పాటు వందలాది భారతీయులు మయన్మార్‌లో ఇలాంటి సైబర్ వెట్టి చాకిరిలో చిక్కుకున్నారని సమాచారం ఉందని, వారిని కూడా సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. యువత ఇలాంటి బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు.
Bandi Sanjay
Cyber Crime
Myanmar
Telangana
Andhra Pradesh
Human Trafficking
India
Cyber Fraud
Victim Rescue
Amit Shah

More Telugu News