KCR: ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్, కేటీఆర్, కవిత

KCR KTR Kavitha Condemn Jammu and Kashmir Terrorist Attack
  • జమ్మూకశ్మీర్ లో భీకర ఉగ్రదాడిలో 26 మంది మృతి
  • ఉగ్రదాడి వార్త తనను కలచివేసిందన్న కేసీఆర్
  • కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్న మాజీ సీఎం
జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత అమానవీయ చర్య అని అన్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కశ్మీర్ పర్యటనకు వచ్చిన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారన్న వార్త తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొని అండగా నిలవాలని కోరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి మారణకాండలు పునరావృతం కాకుండా కేంద్రం కఠినమైన చర్యలు చేపట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. 26 మంది పర్యాటకులు మరణించడంపై ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పర్యాటకుల ప్రాణాలు తీయడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ అన్నారు. ఈ పాశవిక దాడిలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. కశ్మీర్‌లో ఉగ్రవాదానికి స్థానం లేదనే బలమైన సందేశాన్ని కేంద్రం ఇవ్వాలని కేటీఆర్ అన్నారు.

ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ... అమాయకులైన పర్యాటకులను ఉగ్రవాదులు బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కవిత, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
KCR
KTR
Kavitha
Jammu and Kashmir Terrorist Attack
BRS
Terrorism in Kashmir
India Terrorism
Tourist Attack Kashmir
Condemnation of Attack
Political Reactions

More Telugu News