Rajnath Singh: త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ అత్యవసర భేటీ

Rajnath Singh Holds Emergency Meeting with Tri Services Chiefs
  • పహల్గామ్ ఉగ్రదాడిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష
  • భేటీకి ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ కూడా హాజరు
  • జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితి, తదుపరి చర్యలపై చర్చ
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన కిరాతక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. ఈ దాడి ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు ఢిల్లీలో ఉన్నతస్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కీలక భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నౌకాదళ చీఫ్ దినేష్ త్రిపాఠి, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ హాజరయ్యారు.

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రస్తుత భద్రతా పరిస్థితులు, ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పహల్గామ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొన్న తాజా భద్రతా వాతావరణంపై త్రివిధ  దళాధిపతులు రక్షణ మంత్రికి సమగ్రంగా వివరించారు. ఈ అంశంపై కేబినెట్ భద్రతా కమిటీ సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు, ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు ఆపరేషన్లను తీవ్రతరం చేశాయి. దాడి జరిగిన ప్రాంతం సమీపంలోకి అదనపు బలగాలను తరలించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు నిర్దిష్ట ప్రణాళికలతో 'సెర్చ్ అండ్ డెస్ట్రాయ్' ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానిక భద్రతా దళాలను అప్రమత్తం చేశారు.

ఈ క్రమంలో, దాడికి పాల్పడిన ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల స్కెచ్‌లను భద్రతా ఏజెన్సీలు ఇవాళ విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజీ (కోడ్ నేమ్: మూసా), సులేమాన్ షా (కోడ్ నేమ్: యూనస్), అబూ తల్హా (కోడ్ నేమ్: ఆసిఫ్)గా గుర్తించినట్లు అధికారులు తెలిపారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. వీరు గతంలో పూంచ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో కూడా పాల్గొన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. వీరి కోసం కాశ్మీర్ లోయ వ్యాప్తంగా ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Rajnath Singh
Jammu and Kashmir Terrorist Attack
Pahalgham Attack
Indian Army
Air Chief Marshal
National Security Advisor Ajit Doval
Counter Terrorism Operation
Security Meeting
Terrorists Sketches Released

More Telugu News