General Asim Munir: అతడి రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే పహల్గాంలో ఉగ్ర దాడి?

Pahalgham Terror Attack Did General Asim Munirs Speech Trigger the Violence
  • పహల్గాం దాడి వెనుక పాక్ ప్రమేయంపై అనుమానాలు
  • దాడికి ముందు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం
  • పుల్వామా దాడి సమయంలో  ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న మునీర్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి ఘటనలో పాకిస్థాన్ ప్రమేయం ఉందన్న అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి. ముఖ్యంగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కొద్ది రోజుల క్రితం చేసిన తీవ్రమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యల తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. ఈ వ్యాఖ్యలే ఉగ్రమూకలకు ప్రేరణగా నిలిచాయా అనే కోణంలో భారత భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మునీర్ వివాదాస్పద ప్రసంగం

ఇటీవల జరిగిన ఓవర్సీస్ పాకిస్థాన్ కన్వెన్షన్‌లో జనరల్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "కశ్మీర్ నిన్న, నేడు, రేపు మా రక్తనాళం వంటిది. దానిని మేం ఎప్పటికీ మరచిపోలేం. కశ్మీరీ సోదరుల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలిపెట్టం" అని ఆయన అన్నారు. 

అంతేకాకుండా, "మీ పిల్లలకు పాకిస్థాన్ కథ చెప్పండి. మన మతం, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు హిందువుల కంటే భిన్నమైనవి. ఇదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది" అంటూ మతపరమైన విభజనను ప్రేరేపించేలా మునీర్ మాట్లాడారు. ఈ ప్రసంగం చేసిన కొన్నిరోజులకే పహల్గాంలో ఉగ్రదాడి చోటుచేసుకోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

పుల్వామా ఘటనతో ముడిపెడుతున్న విశ్లేషకులు

2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన భీకర ఉగ్రదాడి సమయంలో ఆసిమ్ మునీర్ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) అధిపతిగా ఉన్నారని గుర్తుచేస్తున్నారు. ఆ దాడి వెనుక కూడా ఆయన హస్తం ఉందనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. ఇప్పుడు పాక్ సైన్యాధిపతిగా ఉన్న మునీర్, అదే తరహాలో భారత్‌ను అస్థిరపరిచేందుకు ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 

దీనికి తోడు, దాడి జరిగిన సమయంలోనే పాకిస్థాన్ వాయుసేనకు చెందిన కొన్ని రవాణా, నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి వైమానిక స్థావరాలకు తరలించడం కూడా ఈ అనుమానాలను మరింత బలపరుస్తోందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లష్కరే, ఖలీద్ పాత్రపై సందేహాలు

పహల్గాం దాడి వెనుక పాకిస్థాన్ సైన్యానికి సన్నిహితంగా పనిచేస్తుందని పేరున్న లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆ సంస్థకు చెందిన కమాండర్ సైఫుల్లా కుసురీ అలియాస్ ఖలీద్‌ను ఈ దాడికి ప్రధాన వ్యూహకర్తగా భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఖలీద్‌కు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు (PoK) చెందిన మరో ఇద్దరు కీలక ఉగ్రవాదులు సహకరించినట్లు కూడా సమాచారం అందుతోంది. 

దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న'ది రెసిస్టెన్స్ ఫోర్స్' (TRF) అనే సంస్థకు చెందినవారని భావిస్తున్నారు. ఉగ్రవాదులు ఈ దాడి మొత్తాన్ని కెమెరాల్లో చిత్రీకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
General Asim Munir
Pakistan Army Chief
Pulwama Attack
Pahalgham Attack
Jammu and Kashmir Terrorism
Lashkar-e-Taiba
Khalid
Terrorism in India
Pakistan's Role in Terrorism
Cross Border Terrorism

More Telugu News