Pahalgam Terrorist Attack: ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి... ఉదార‌త చాటుతున్న కశ్మీరీలు

Kashmiris Extend Help to Tourists After Pahalgam Terrorist Attack
  • ప‌ర్యాట‌కుల‌కు ఉచితంగా ట్యాక్సీ, ఆటో స‌ర్వీసులు అందిస్తున్న క‌శ్మీరీలు
  • మ‌రికొంద‌రు స్థానికులు సంద‌ర్శ‌కుల‌కు ఫ్రీగా ఆశ్ర‌యం క‌ల్పిస్తున్న వైనం
  • శ్రీన‌గ‌ర్‌కు చెందిన ఓ వైద్యుడు త‌న ఇంటినే హోట‌ల్‌గా మార్చి ఉచితంగా వ‌స‌తి
ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో అక్క‌డి వ్యాపారులు ఉదార‌త‌ను చాటుతున్నారు. భ‌యంతో బిక్కుబిక్కుమంటున్న ప‌ర్యాట‌కుల‌కు ఉదారంగా సాయం చేస్తున్నారు. ట్యాక్సీవాళ్లు, ఆటో డ్రైవ‌ర్లు ఉచితంగానే సంద‌ర్శ‌కుల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేరుస్తున్నారు. మ‌రికొంద‌రు స్థానికులు ప‌ర్యాట‌కుల‌కు ఉచితంగా ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారు. 

"ఇది కేవ‌లం సంద‌ర్శ‌కుల మీదే కాదు... క‌శ్మీర్ ఆత్మ‌పై ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడి. ప‌ర్యాట‌కులు మాకు అతిథులుగా వ‌చ్చారు. ఇప్పుడు భ‌యంతో బిక్కుబిక్కుమంటూ వెళుతున్నారు. ఇది చాలా బాధ‌గా అనిపిస్తోంది. న‌వ దంప‌తులు భ‌యంతో వ‌ణుకుతూ వ‌చ్చి ఎయిర్‌పోర్టుకు ఎలా వెళ్లాల‌ని అడిగారు. 

వారిని సుర‌క్షితంగా విమానాశ్ర‌యంలో దిగబెట్టాను. ఆ స‌మ‌యంలో వారు నాకు డ‌బ్బులిచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, అలాంటి ప‌రిస్థితుల్లో వారి వ‌ద్ద నేను డ‌బ్బులు ఎలా తీసుకోగ‌ల‌ను" అని బిలాల్ అహ్మ‌ద్ అనే ఆటోడ్రైవ‌ర్ ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ అన్నారు. 

ఇక శ్రీన‌గ‌ర్‌కు చెందిన ఓ వైద్యుడు త‌న నివాసాన్నే హోట‌ల్‌గా మార్చి సంద‌ర్శ‌కుల‌కు ఉచితంగా వ‌స‌తి క‌ల్పించారు. ఇలా క‌శ్మీరీలు ప్ర‌స్తుత క్లిష్ట ప‌రిస్థితుల్లో మంచి మ‌న‌సును చాటుకుంటున్నారు. 
Pahalgam Terrorist Attack
Bilal Ahmad
Kashmiri Hospitality
Kashmir Tourism
Srinagar
Terrorism in Kashmir
Humanitarian Aid
Kashmiri People
Helping Tourists

More Telugu News