Indian Expat: 42 ఏళ్లు బ‌హ్రెయిన్‌లో చిక్కుకున్న భార‌త వ్య‌క్తి.. ఎట్ట‌కేల‌కు విముక్తి

42 Years Stranded in Bahrain Indian Man Finally Returns Home
  • బ‌తుకుదెరువు కోసం 1983లో బ‌హ్రెయిన్ వెళ్లిన కేర‌ళ వ్య‌క్తి గోపాల‌న్ చంద్ర‌న్
  • అక్క‌డ ఆశ్ర‌యం క‌ల్పించిన య‌జ‌మాని చనిపోవ‌డంతో అత‌ని పాస్‌పోర్ట్ మిస్ 
  • అప్ప‌టి నుంచి చంద్ర‌న్ బ‌హ్రెయిన్‌లోనే చిక్కుకుపోయిన వైనం
  • 'ప్ర‌వాసీ లీగ‌ల్ సెల్' అనే సంస్థ సాయంతో ఇన్నేళ్ల‌కు భార‌త్‌కు తిరిగొచ్చిన చంద్ర‌న్‌
కేర‌ళ‌కు చెందిన గోపాల‌న్ చంద్ర‌న్ బ‌తుకుదెరువు కోసం 1983లో బ‌హ్రెయిన్ వెళ్లాడు. అక్క‌డ ఆశ్ర‌యం క‌ల్పించిన య‌జ‌మాని చనిపోవ‌డంతో ఆయ‌న‌కిచ్చిన పాస్‌పోర్టు కూడా మిస్ అయింది. అప్ప‌టి నుంచి చంద్ర‌న్ బ‌హ్రెయిన్‌లోనే చిక్కుకున్నాడు. 

ఎట్ట‌కేల‌కు 'ప్ర‌వాసీ లీగ‌ల్ సెల్' అనే సంస్థ సాయంతో ఇన్నేళ్ల‌కు భార‌త్‌కు తిరిగొచ్చాడు. విదేశాలలో అన్యాయాన్ని ఎదుర్కొంటున్న భారతీయుల కోసం పోరాడే రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయవాదులు, జర్నలిస్టులతో కూడిన ఈ ప్రవాసీ లీగల్ సెల్ అనే ఎన్‌జీఓ ద్వారా అతను స్వదేశానికి తిరిగి రావడం సాధ్యమైంది.

గోపాల‌న్ చంద్ర‌న్ క‌న్నీటి గాథ‌ను ప్రవాసీ లీగల్ సెల్ త‌న‌ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పంచుకుంది. "కేరళలోని పౌడికోణం సమీపంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన‌ చంద్రన్ 1983లో బహ్రెయిన్‌కు వచ్చాడు. అయితే, దురదృష్టకర సంఘటనలు అత‌డిని వెంటాడాయి. బహ్రెయిన్ లో అత‌నికి ఆశ్ర‌యం క‌ల్పించిన‌ యజమాని మరణించాడు. ఆయ‌న చ‌నిపోవ‌డంతో చంద్ర‌న్‌ పాస్‌పోర్ట్ పోయింది. 

ఫలితంగా అత‌డు ఎటువంటి ధృవ‌ పత్రాలు లేకుండా ఉండిపోయాడు. దాంతో ఏళ్ల త‌ర‌బ‌డి అత‌డు ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని చిక్కులతో బహ్రెయిన్‌లోనే ఉండిపోయాడు. ఇలా 42 సంవత్సరాల పాటు దేశం కాని దేశంలో చిక్కుకుపోయాడు" అని ఎన్‌జీఓ తెలిపింది.  

బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం, కింగ్‌డమ్‌కు చెందిన‌ ఇమ్మిగ్రేషన్ విభాగంతో 'ప్ర‌వాసీ లీగ‌ల్ సెల్' బృందం సమన్వయం చేసుకుని, చంద్రన్ తిరిగి స్వ‌దేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేసింది. దాంతో నాలుగు దశాబ్దాలుగా బిడ్డ రాక కోసం చూస్తున్న 95 ఏళ్ల త‌ల్లి ఎద‌రుచూపులు ఫ‌లించాయి.  

"ఇది కేవలం ఒక వ్యక్తి ఇంటికి వెళ్లే కథ కాదు. మానవత్వం, న్యాయం, అవిశ్రాంత ప్ర‌య‌త్నం కలిసి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో చెప్పే కథ ఇది. వినబడని లెక్కలేనన్ని వలసదారులకు ఇది ఒక ఆశకు చిహ్నం లాంటిది. ఇంటికి స్వాగతం, గోపాలన్. మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోలేం" అని ఎన్‌జీఓ త‌న‌ పోస్ట్‌లో రాసుకొచ్చింది. 
Indian Expat
Gopalan Chandran
Bahrain
India
Pravasi Legal Cell
Kerala
Immigration
Passport Lost
stranded

More Telugu News