Danam Nagender: కేసీఆర్ సభ, స్మితా సబర్వాల్ అంశంపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

Danam Nagenders Key Remarks on KCRs Public Meeting and Smitha Sabarwal Issue
  • కేసీఆర్ సభ విజయవంతం అవుతుందన్న దానం నాగేందర్
  • కేసీఆర్‌ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని వెల్లడి
  • గచ్చిబౌలి భూములపై స్మితా సబర్వాల్ ట్వీట్‌లో తప్పేం లేదని వ్యాఖ్య
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. కేసీఆర్ బహిరంగ సభ, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్‌పై ఆయన స్పందించారు.

బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు తలపెట్టిన సభ విజయవంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని, ఆయన సభకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతారని దానం అభిప్రాయపడ్డారు.

గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌ను దానం నాగేందర్ సమర్థించారు. ఆమె ట్వీట్‌లో ఎలాంటి తప్పు లేదని, ఆమె వాస్తవాన్నే పేర్కొన్నారని అన్నారు. ఆ ట్వీట్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లుగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే భూముల విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై తీవ్రంగా స్పందించిందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భూముల విషయంలో పునరాలోచన చేస్తుందని దానం వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ కొన్నిరోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

మరోవైపు తెలంగాణ సాధన కోసం ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎల్కతుర్తి సమీపంలో దాదాపు 1,250 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం, పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. సుమారు 40 నుంచి 50 వేల వాహనాలు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సభా స్థలికి నలువైపులా ప్రత్యేక పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ ఇదివరకే తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల కోసం వేర్వేరు మార్గాల్లో విస్తారమైన పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Danam Nagender
KCR
K Chandrashekar Rao
BRS Party
Smitha Sabarwal
Gachibowli land scam
Telangana Politics
Elka Thurthy Public Meeting
TRS 25th Anniversary

More Telugu News