Chandrababu Naidu: వీళ్లు తండ్రి చాటు బిడ్డలు అనుకున్నాను... కానీ! చంద్రబాబు

Chandrababu Naidus Inspiring Speech at Mindset Shift Book Launch
  • మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకం రాసిన డాక్టర్ శరణి
  • విజయవాడలో పుస్తకావిష్కరణ కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా చంద్రబాబు
నమ్మకానికి సంకల్పం తోడైతే ఎటువంటి సవాళ్లనైనా అధిగమించవచ్చునని, మనిషి దృఢ సంకల్పం ఎంతలా పని చేస్తుందనడానికి ఎన్టీఆర్ జీవితమే ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు అన్నారు. మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైడ్‌సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలి కాపీని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. అనంతరం శరణి అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు.   

నారాయణ కూతుళ్ల ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయా

నారాయణ కూతుళ్లను ఇప్పటిదాకా చిన్నపిల్లలుగానే చూశాను. నారాయణ అంటే నాకు పరిచయమే కాదు ప్రత్యేక అభిమానం. ఉన్నత స్థితికి ఎదిగిన మిమ్మల్ని(శరణి), మీ సోదరిని చూసి ఆశ్చర్యపోయాను. తండ్రిచాటు బిడ్డల్లా నారాయణ సంస్థలను నడుపుతున్నారనుకున్నాను. కానీ మీకంటూ ఒక ఆచరణ ఉంది. 47 ఏళ్లుగా నేను చేసే సాధనలు మీరు చిన్న వయసులోనే చేస్తున్నారు. మైండ్ సెట్ అనేది నారాయణ సంస్థల్లో ఒక బ్రాండ్. ఒక సాధారణ విద్యార్థిని నారాయణ సంస్థల్లోకి పంపితే అసాధారణ విద్యార్ధిగా తీర్చిదిద్ది పంపుతున్నారు. మంచి అంశాన్ని ఎంచుకుని మైండ్ సెట్‌ను మార్చుకుంటే ఏదైనా సాధించగలరని అతి చిన్న వయసులోనే పుస్తకం రాసి నిరూపించిన శరణిని అభినందిస్తున్నా. 

ఎన్టీఆర్ కష్టపడి పైకొచ్చారు

చిరంజీవి ఒక సంకల్పం తీసుకుని అద్భుత నటుడు అయ్యారు. చిరంజీవి తన జీవితంలో పాజిటివ్ మైండ్‌సెట్ అభివృద్ధి చేసుకుని లక్ష్యాన్ని ఛేదించేవరకు నిరంతర కృషి చేశారు. ఎన్టీఆర్ ఉన్నంతకాలం చిరంజీవి ఒక స్థాయికి ఎదిగారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆకాశమే హద్దుగా చిరంజీవి మహానటుడిగా ఎదిగారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఛాలెంజ్, సంక్షోభం వస్తాయి. ఏ రాజకీయ నాయకుడికి రానన్ని సంక్షోభాలు నాకు వచ్చాయి. వాటిని బలంగా ఎదుర్కొని పైకి వచ్చాను. గాంధీ, అంబేద్కర్ సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. అంబేద్కర్ అంటరాని తనం, అవమానాలు భరించి రాజ్యాంగాన్ని రాసి చిరస్థాయిగా భావితరాలకు ఆదర్శంగా నిలిచారు.

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ 

ఆ రోజుల్లో ఐఐటీలో ఒకశాతం కూడా అడ్మిషన్స్ వచ్చేవి కావు. విద్యాసంస్థల అధినేతలను పిలిచి ఐఐటీలో మనం నెంబర్ వన్‌గా ఉండాలని చెప్పాను. తర్వాత వచ్చిన మార్పులతో 20 శాతం సీట్లు మనవాళ్లే సాధిస్తున్నారు. బిట్స్ పిలానీలో 70 శాతం తెలుగువారే ఉండేవారు. ఇంతమంది ఎలా వస్తున్నారు, మార్కులు తారుమారు చేస్తున్నారేమోనని వాళ్ల సొంత వ్యవస్థతో పరీక్షలు నిర్వహించినా ఏమాత్రం తగ్గకుండా మనవాళ్లు ఎంపికయ్యారు. గతంలో సరైన టెక్నాలజీ ఉండేదికాదు. ఇప్పుడు టెక్నాలజీతో పాటు రియల్ టైం సమాచారం వచ్చింది. క్వాంటమ్ వ్యాలీ కూడా వచ్చేసింది. క్వాంటమ్ వ్యాలీ ఏంటనేది చాలా మందికి తెలీదు... ప్రస్తుతం పని చేస్తున్న కంప్యూటర్ల కంటే వెయ్యి రెట్లు వేగంగా పని చేయడమే క్వాంటమ్ వ్యాలీ. దీనిని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాం.


ప్రధాని మోదీకి సంఘీభావంగా నిలబడాలి

‘మైండ్ సెట్ ఫిష్ట్ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలి. మనం చేసే ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు ఉన్నత స్థాయికి తీసుకొస్తాయి. నేను సీఎంగా ఉన్నసమయంలో చిరంజీవి కలిశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్ పెడతాను.. స్థలం ఇవ్వాలని కోరారు. సినిమాల్లో ఉండి సామాజిక సేవ కోసం మంచి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి. ప్రజల్ని, విద్యార్థులను మోటివేట్ చేయడం గొప్ప కార్యక్రమం. 11 ఏళ్లుగా దేశానికి మోదీ ప్రధానిగా ఉన్నారు. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైంది. భారతదేశం ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. భవిష్యత్‌లో మొదటి స్థానానికి చేరుకుంటుంది. పహల్గామ్‌లో ఉగ్రవాదులు దాడిచేసి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. దేశం సుస్థిరంగా ముందుకెళ్లే సమయంలో అస్థిర పరిస్థితులు సృష్టించాలని దాడులకు తెగబడ్డారు. దీన్ని ప్రతి భారతీయుడు ఖండించాలి. దేశంలో అరాచకాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి సంఘీభావాన్ని తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది... అని సీఎం చంద్రబాబు అన్నారు.   
Chandrababu Naidu
Nara Lokesh
Mindset Shift
Book Launch
Chiranjeevi
Naryana
Quantum Valley
Amaravati
Narendra Modi
Telugu Politics

More Telugu News