India-Pakistan Tension: ఎల్ఓసీ వెంబ‌డి పాక్ సైన్యం దుశ్చ‌ర్య‌... భార‌త బ‌ల‌గాల‌పై కాల్పులు

Pakistan Armys Ceasefire Violation Firing on Indian Forces Along LOC
  • ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌తలు నెలకొన్న వేళ స‌రిహ‌ద్దులో అల‌జ‌డి
  • కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్‌ సైన్యం దుశ్చ‌ర్య‌
  • ఎల్ఓసీ వెంబ‌డి ప‌లు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులు
ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడితో భార‌త్‌, పాక్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇరు దేశాలు పోటాపోటీగా ఆంక్ష‌లు విధిస్తున్నాయి. అయితే, రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌తలు నెలకొన్న వేళ స‌రిహ‌ద్దులో అల‌జ‌డి చోటుచేసుకుంది. పాకిస్థాన్ సైన్యం కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డింది. 

నియంత్ర‌ణ రేఖ (ఎల్ఓసీ) వెంబ‌డి ప‌లు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పుల‌కు తెగ‌బ‌డింది. అయితే, శ‌త్రువుల దాడిని భార‌త బ‌ల‌గాలు స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్నాయి. అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదని, ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని ఆర్మీ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. 

ఇదిలాఉంటే... తాజా ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది ఈరోజు జ‌మ్మూకశ్మీర్‌కు వెళ్ల‌నున్నారు. శ్రీన‌గ‌ర్‌తో పాటు ఉద‌మ్‌పూర్‌లో ప‌ర్య‌టిస్తారు. క‌శ్మీర్ లోయ‌లోని ఆర్మీ క‌మాండర్‌లు, ఇత‌ర ఏజెన్సీల ప్ర‌తినిధుల‌తో భేటీ కానున్నారు. స‌రిహ‌ద్దుల వ‌ద్ద కాల్పుల విర‌మ‌ణ, ప‌హ‌ల్గామ్ దాడి నేప‌థ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది. 

మ‌రోవైపు బందిపొరాలో శుక్ర‌వారం ఎన్‌కౌంట‌ర్ జ‌రుగుతోంది. ఈ జిల్లాలోని కుల్నార్ బజిపొరా ప్రాంతంలో ఉగ్ర‌వాదులు న‌క్కి ఉన్నార‌నే నిఘా వ‌ర్గాల‌ స‌మాచారంతో భ‌ద్ర‌తా సిబ్బంది నిర్బంధ త‌నిఖీలు చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో భార‌త సైన్యాన్ని చూసిన ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో భార‌త బ‌ల‌గాలు ఎదురు కాల్పులు జ‌రిపాయి. ప్ర‌స్తుతం ఇక్క‌డ ఎన్‌కౌంట‌ర్ కొన‌సాగుతోంద‌ని అధికారులు వెల్లడించారు.     
India-Pakistan Tension
Pakistan Army
LOC Firing
Jammu and Kashmir
General Bipin Rawat
Army Chief
Terrorist Encounter
Pulwama Attack
Cross Border Firing
Line of Control

More Telugu News