Palnadu Collector Arun Babu: పదిలో అద్వితీయ ప్రతిభ చాటిన పల్నాడు విద్యార్థినికి బహుమానంగా ఎకరం పొలం

Palnadu 10th Class Topper Awarded Land
  • 593 మార్కులతో సత్తా చాటిన నిరుపేద విద్యార్థిని అమూల్య
  • అమూల్య కుటుంబానికి పల్నాడు కలెక్టర్ దన్ను
  • ప్రభుత్వ పథకం కింద ఎకరం పొలం మంజూరు
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల్లో అద్వితీయ ప్రతిభ చాటిన ఓ నిరుపేద విద్యార్థినికి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అండగా నిలిచారు. ప్రభుత్వం తరఫున ఎకరం భూమిని మంజూరు చేశారు. భూమిలేని నిరుపేదల పథకం కింద ఎకరం పొలం మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడం, పేద కుటుంబాలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నాదెండ్ల మండలం చిరుమామిళ్ల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని అమూల్య సత్తా చాటింది.

మొత్తం 600 మార్కులకు గాను 593 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా అమూల్యను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అభినందించారు. అమూల్య కుటుంబ నేపథ్యం తెలుసుకున్న కలెక్టర్ చలించిపోయారు. అమూల్య తల్లిదండ్రులు అనిల్, రూతమ్మ నిరుపేదలని, కూలి పనులు చేస్తూ అమూల్యతో పాటు మరో ముగ్గురు ఆడపిల్లలను చదివిస్తున్నారని తెలుసుకుని వారిని అభినందించారు. భూమి లేని నిరుపేదల పథకం కింద విద్యార్థిని కుటుంబానికి ఎకరం పొలం మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు ప్రకటించారు. కలెక్టర్ ప్రకటనపై అనిల్, రూతమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే భూమిని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తామని వారు తెలిపారు.
Palnadu Collector Arun Babu
Andhra Pradesh
10th Class Topper
Amulya
Government Land Allotment
Poor Student
Educational Achievement
Financial Aid
Chirumamilla ZP High School
Nadigunta Mandal

More Telugu News