Asaduddin Owaisi: మసీదు వద్ద నల్ల బ్యాడ్జీలు పంపిణీ చేసిన అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi Distributes Black Badges at Mosque
  • పహల్గాం ఉగ్రదాడిపై అసదుద్దీన్ ఒవైసీ నిరసన
  • శుక్రవారం ప్రార్థనల ముందు నల్ల బ్యాడ్జీలు పంపిణీ
  • ఉగ్రదాడిపై ప్రభుత్వ కఠిన చర్యలకు ఒవైసీ మద్దతు
  • పాక్‌కు నీటి సరఫరా నిలిపివేతపై కేంద్రాన్ని ప్రశ్నించిన వైనం
పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. శుక్రవారం ప్రార్థనలకు ముందు శాస్త్రిపురంలోని మసీదు వద్ద ఆయన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చార్మినార్, మక్కామసీదు పరిసర ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.

శుక్రవారం ప్రార్థనల కోసం మసీదుకు వచ్చిన వారికి అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా నల్ల బ్యాడ్జీలను పంపిణీ చేశారు. తాను కూడా చేతికి నల్ల బ్యాడ్జీ ధరించారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించాలని ఆయన అక్కడి వారికి పిలుపునిచ్చారు. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పహల్గాం ఉగ్రదాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన వైఖరిని తాను సమర్థిస్తున్నట్లు ఒవైసీ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే, ఇదే సమయంలో పాకిస్థాన్‌కు నీటి సరఫరా నిలిపివేయాలనే వాదనలపై ఆయన స్పందిస్తూ, ఒకవేళ నీటిని నిలిపివేస్తే, ఆ నీటిని ఎక్కడ నిల్వ చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు.

మక్కా మసీదులో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన

పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మక్కా మసీదులో ముస్లింలు నల్ల రిబ్బన్లు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంత దూరం ర్యాలీ నిర్వహించారు. హిందూస్థాన్ జిందాబాద్ అంటూ నినదించారు.
Asaduddin Owaisi
AIMIM
Palhalgam Attack
Terrorism
Protest
Black Badges
Hyderabad MP
India-Pakistan
Charminar
Mecca Masjid

More Telugu News