Saitan Singh: సరిహద్దుకు అవతల పాకిస్థాన్ అమ్మాయి... పెళ్లికొడుకు మనోడు... పెళ్లి ఆగిపోయింది!

Cross Border Wedding Halted by India and Pakistan Tensions
  • పహల్గామ్ దాడితో భారత్-పాక్ సరిహద్దుల మూసివేత
  • నిలిచిపోయిన భారత్-పాక్ వివాహం
  • పెళ్లి చేసుకోవడానికి వెళ్లలేకపోయిన రాజస్థాన్ యువకుడు
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. ఈ దుర్ఘటన కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో భారత ప్రభుత్వం పలు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అట్టారీ-వాఘా సరిహద్దును మూసివేయడంతో, సరిహద్దులు దాటి జరగాల్సిన ఓ పెళ్లి ఆగిపోయింది. రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌ సింగ్ అనే యువకుడు తన వివాహం కోసం పాకిస్థాన్ వెళ్లాల్సి ఉండగా, సరిహద్దు మూసివేతతో మొత్తం తలకిందులు అయింది.

వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌ సింగ్‌కు, పాకిస్థాన్ లో నివసించే ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. వరుడి తరపు బంధువుల్లో కొందరు ఇప్పటికే వివాహం కోసం పాకిస్థాన్ చేరుకున్నారు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న తరుణంలో పహల్గామ్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం, పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది. తక్షణ చర్యగా అట్టారీ-వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు ప్రకటించింది

ఈ నిర్ణయంతో పాకిస్థాన్ లోని వధువు ఇంటికి వెళ్లే మార్గం సైతాన్‌ సింగ్‌కు మూసుకుపోయింది. దీంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "ఉగ్రవాదులు చేసింది చాలా తప్పు. సరిహద్దు మూసివేయడంతో మమ్మల్ని పాకిస్థాన్ కు వెళ్లేందుకు అనుమతించడం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి" అని తన ఆవేదన వ్యక్తం చేశాడు. నిర్ణీత ముహూర్తానికి పెళ్లి ప్రాంగణానికి చేసుకోవాల్సిన తాము, ఇలాంటి ఊహించని అడ్డంకితో ఆగిపోయిమని చెప్పాడు.

సైతాన్ సింగ్ సోదరుడు సురీందర్ సింగ్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. "పహల్గామ్ పర్యాటకులపై జరిగిన దాడి చాలా దురదృష్టకరం. ఈ దాడి మా కుటుంబంతో సహా ఎంతోమంది అమాయక పౌరుల జీవితాలను ప్రభావితం చేసింది" అని అన్నాడు. తమ కుటుంబం ఎంతో ఆశగా ఎదురు చూసిన వివాహం ఇలా ఆగిపోవడం బాధాకరమని చెప్పాడు.
Saitan Singh
Pakistan-India border closure
Attari-Wagah border
Cross-border marriage
Terrorist attack in Pahalgam
Jammu and Kashmir
India-Pakistan tensions
Wedding cancelled
Rajasthan
Suriender Singh

More Telugu News