Perni Nani: మీకు డబ్బున్న వాళ్లే కనిపిస్తారా?: పేర్ని నాని

Perni Nani Slams Pawan Kalyan and Home Minister Anita
  • పిఠాపురంలో దళితులను వెలివేస్తే డిప్యూటీ సీఎం పవన్ పట్టించుకోలేదన్న వైసీపీ నేత పేర్ని
  • వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హోంమంత్రి అనిత అక్కడకు పరిగెత్తుకెళ్లారన్న పేర్ని
  • కూటమి సర్కార్‌కు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా  
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు.

దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపు కన్నెత్తి చూడలేదని పేర్ని అన్నారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హోంమంత్రి అక్కడకు పరిగెత్తారని అన్నారు. మీకు డబ్బున్నవారే కనిపిస్తారా, సామాన్యులు, దళితులను పట్టించుకోరా అంటూ నిలదీశారు.

గతంలో తమ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై విష ప్రచారం చేశారని, ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి నానా యాగీ చేశారని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు లక్షా 3 వేల కోట్ల అప్పు నేరుగా తెచ్చారని అన్నారు. రూ.44 వేల కోట్లను కార్పొరేషన్ల ద్వారా అప్పు తెచ్చారని అన్నారు. మొత్తం ఒక లక్షా 47 వేల కోట్లకు పైగా అప్పులు చేశారని అన్నారు. జగన్ హయాంలో చేసిన అప్పులతో పోర్టులు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, ఆర్బీకే భవనాల నిర్మాణం, పాఠశాలల అభివృద్ధి ఇలా అనేక రూపాల్లో కనిపిస్తున్నాయన్నారు.

జగన్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉందని కానీ చంద్రబాబు చేస్తున్న అప్పులు ఏం చేస్తున్నారో చెప్పడం కూడా లేదన్నారు. ఎన్నికలకు ముందు ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదంటున్నారన్నారు. ఏపీలో కూటమి సర్కార్‌కి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ పేర్ని ఎద్దేవా చేశారు. 
Perni Nani
Pawan Kalyan
AP Politics
Andhra Pradesh
YSRCP
Janasena
Anita Vangala
Chandrababu Naidu
Dalit Issues
Debt Crisis

More Telugu News