US Student Visas: అమెరికాలో విద్యార్థి వీసాల రద్దుకు తాత్కాలిక బ్రేక్.. అంతర్జాతీయ విద్యార్థులకు ఊరట

Temporary Halt on US Student Visa Revocations
  • అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దు తాత్కాలికంగా నిలిపివేసిన యూఎస్
  • సమీక్ష, రద్దుల కోసం కొత్త వ్యవస్థను రూపొందిస్తున్న ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ
  • భారత విద్యార్థులపై ఎక్కువగా ప్రభావం చూపిన వీసా రద్దులు
  • కోర్టులో దావాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ నిర్ణయం
  • ప్రభావిత విద్యార్థుల 'సెవిస్' స్టేటస్ యాక్టివ్‌గా ఉంచాలని ఐసీఈ  ఆదేశం
అంతర్జాతీయ విద్యార్థులకు జారీ చేసిన వీసాల రద్దు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి వ్యతిరేకంగా యూనివర్సిటీల్లో నిరసనల్లో పాల్గొన్నారన్న ఆరోపణలు, ఇతర చట్ట ఉల్లంఘనల కారణంగా పలువురు విద్యార్థుల వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

అసిస్టెంట్ యూఎస్ అటార్నీ జోసెఫ్ ఎఫ్. కారిల్లీ జూనియర్ ఈ విషయాన్ని వాషింగ్టన్ డీసీ కోర్టుకు తెలియజేశారు. ఇమ్మిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వీసాల సమీక్ష, రద్దుల కోసం ఒక కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని, అది పూర్తయ్యే వరకు విద్యార్థుల సెవిస్ (స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) స్టేటస్‌ను మార్చబోమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రద్దు చేసిన వారి స్టేటస్‌ను కూడా తిరిగి యాక్టివేట్ చేయనున్నట్లు తెలిపారు.

ఇటీవల రద్దు చేసిన వీసాల్లో దాదాపు 1,500 మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని, వీరిలో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉందని వార్తలు వచ్చాయి. ఒక అమెరికన్ లాయర్ల సంఘం లెక్కల ప్రకారం, వారు సమీక్షించిన 300 రద్దు కేసుల్లో 50 శాతం భారతీయులవేనని తెలిసింది. అయితే, అధికారిక గణాంకాలు ఇంకా విడుదల కాలేదు.

వీసాలు రద్దు చేయబడిన విద్యార్థులు, వారి తరఫు న్యాయవాదులు పెద్ద ఎత్తున కోర్టులలో దావాలు వేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే వీసా రద్దు కావడంతో స్వదేశాలకు తిరిగి వెళ్లిన విద్యార్థుల పరిస్థితి ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. 
US Student Visas
Visa Revocation
Joseph F. Carilli Jr.
International Students
Israel-Gaza Conflict
Immigration and Customs Enforcement
Student and Exchange Visitor Information System (SEVIS)
Indian Students
US Immigration Law

More Telugu News