Stolen Car: ఎత్తుకెళ్లిన కారును తిరిగి అదే ఓనర్ కు అమ్మిన దొంగలు.. బ్రిటన్ లో వింత ఘటన

Software Engineer Buys Back His Stolen Car in Bizarre UK Incident
  • గత ఫిబ్రవరిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కారు చోరీ
  • బీమా పరిహారంతో అదే మోడల్ కారు కొనుగోలు చేసిన టెకీ
  • కొత్తగా కొన్న కారును పరిశీలించి చూడగా తన కారేనని గుర్తించిన వైనం
  • కారులోని వస్తువులు, శాటిలైట్ నావిగేషన్ ఆధారంగా నిర్ధారణ
బ్రిటన్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల తన కారును దొంగలు ఎత్తుకెళ్లడంతో చేసేదేమీ లేక మరో కారును కొనుగోలు చేశాడు. తీరా చూస్తే ఆ కారు తను పోగొట్టుకున్నదేనని గుర్తించాడు. ఒకే కారును రెండుసార్లు కొనుగోలు చేసినట్లయిందంటూ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. బ్రిటన్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్, సోలిహల్‌కు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈవాన్ వాలెంటైన్‌ కు చెందిన నల్ల రంగు హోండా సివిక్ కారు గత ఫిబ్రవరిలో చోరీకి గురైంది. ఇంటి ముందు పార్క్ చేసిన కారును దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కారు దొరకడం కష్టమని వారు తెలిపారు. అదృష్టవశాత్తూ బీమా కంపెనీ పరిహారం చెల్లించడంతో ఈవాన్ కు కాస్త ఊరట లభించింది. ఆ వచ్చిన సొమ్ముతో తన పాత కారు లాంటిదే మరొకదాన్ని కొనుగోలు చేయాలని ఈవాన్ నిర్ణయించుకున్నాడు.

తనకు ఇష్టమైన అదే మోడల్, అదే రంగు కారు కోసం వెతుకుతుండగా, ఆన్‌లైన్‌లో ఒక వాహనం కనిపించింది. అచ్చం తన పాత కారులాగే ఉండటంతో సుమారు రూ. 22 లక్షలు (£20,000) చెల్లించి దాన్ని కొనుగోలు చేశాడు. అయితే, కారును ఇంటికి తెచ్చాక అందులో కొన్ని పాత వస్తువులు (టెంట్ మేకు, క్రిస్మస్ చెట్టు ఆకులు, చాక్లెట్ రేపర్లు) చూసి అతనికి అనుమానం వచ్చింది. అవి తన పాత కారులో ఉన్న వస్తువులనే పోలి ఉన్నాయి.

ఇంకా అనుమానంతో కారులోని శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ హిస్టరీని పరిశీలించగా, అందులో తన పాత చిరునామాలు కనిపించడంతో ఈవాన్ నిశ్చేష్టుడయ్యాడు. తాను కొన్నది తన పోయిన కారేనని నిర్ధారించుకుని షాక్‌కు గురయ్యాడు. "ఆ నిజం తెలిసినప్పుడు నా చేతులు వణికిపోయాయి, గుండె వేగంగా కొట్టుకుంది. దాదాపు కారును క్రాష్ చేసేంత షాక్‌లో ఉన్నాను" అని ఈవాన్ తెలిపాడు. మొదట పోయిన కారును తిరిగి సంపాదించినట్లు అనిపించినా, తెలివితక్కువగా దొంగల చేతిలో మోసపోయి తన కారునే తిరిగి కొన్నానని తర్వాత గ్రహించినట్లు అతడు చెప్పాడు. నేరస్థులు కారు నంబర్ ప్లేట్‌ను మార్చి, మైలేజీని తగ్గించి అమ్మకానికి పెట్టడంతో తన కారును గుర్తించలేకపోయానని ఈవాన్ వివరించాడు.
Stolen Car
Car Re-purchase
Honda Civic
Car Theft
Britain
Evan Valentine
West Midlands
Solihull
Software Engineer
Viral Social Media Post

More Telugu News