FIITJEE: ఫిట్జీపై ఈడీ కొరడా... డైరెక్టర్ ఇంట్లో రూ. 4.89 కోట్ల విలువైన బంగారం సీజ్

FIITJEE fraud ED seizes Rs 489 cr jewellery Rs 10 lakh from director DK Goel offices
  • ఫిట్జీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్, కార్యాలయాల్లో ఈడీ విస్తృత సోదాలు
  • రూ. 4.89 కోట్ల విలువైన నగలు, రూ. 10 లక్షల నగదు స్వాధీనం
  • విద్యార్థుల నుంచి రూ. 206 కోట్లు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు
  • నిధుల మళ్లింపు, 32 కేంద్రాల మూసివేత; 14,411 మంది విద్యార్థులు ప్రభావితం
  • పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు ముమ్మరం
దేశవ్యాప్తంగా పలు కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న ఫిట్జీ (FIIT-JEE) సంస్థలో భారీ ఆర్థిక మోసం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. సంస్థ డైరెక్టర్ డి.కె. గోయల్ నివాసం, సీఈవో, సీఓఓ, సీఎఫ్‌ఓలతో పాటు పలు అధికారిక కార్యాలయాల్లో ఈడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ. 4.89 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన నిధులను యాజమాన్యం పక్కదారి పట్టించి, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని, అధ్యాపకులకు జీతాలు కూడా చెల్లించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఈడీ పేర్కొంది. ప్రస్తుతం నడుస్తున్న బ్యాచ్‌ల విద్యార్థుల నుంచి సుమారు రూ. 206 కోట్లు వసూలు చేశారని, అయితే వారికి చెప్పినట్లుగా విద్యా సేవలు అందించలేదని ఈడీ తెలిపింది. 

నిధులను దుర్వినియోగం చేయడం వల్లనే ఘజియాబాద్, లక్నో, నోయిడా, ఢిల్లీ, భోపాల్, ముంబై సహా దేశవ్యాప్తంగా 32 కోచింగ్ సెంటర్లను ఆకస్మికంగా మూసివేశారని, దీనివల్ల 14,411 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఈడీ వివరించింది.

నోయిడా, లక్నో, ఢిల్లీ, భోపాల్ సహా పలు పోలీస్ స్టేషన్లలో ఫిట్జీ యాజమాన్యంపై నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేశారు. సోదాల్లో కీలకమైన పత్రాలు, డిజిటల్ ఆధారాలు లభించాయని, విద్యా సేవల ముసుగులో విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేసేందుకు పథకం ప్రకారం నిధులను పక్కదారి పట్టించినట్లు ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయని ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.
FIITJEE
ED raids
DK Goyal
Financial Fraud
Coaching Centers
Money Laundering
PMLA
Student Fees
India
Financial Crime

More Telugu News