Chandrababu Naidu: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరో పథకం ప్రారంభించాం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Launches New Scheme for AP Fishermen
  • నేడు మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభించిన కూటమి ప్రభుత్వం
  • శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం గ్రామంలో చంద్రబాబు పర్యటన
  • మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న వైనం
ఏపీలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. దీనిపై సీఎం చంద్రబాబు ఎక్స్ లో స్పందించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మత్స్యకారులకు వేట విరామ కాలంలో అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో రూ.10 వేలుగా ఉన్న ఈ సహాయాన్ని రూ. 20 వేలకు పెంచామని, ఈ పథకం కింద నేడు 1,29,178 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున మొత్తం రూ. 258.35 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.

వేట నిషేధ సమయంలో ఆదాయం లేక మత్స్యకారులు పడే ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా చూశానని, వారి కష్టాలను దృష్టిలో ఉంచుకొనే ఈ సాయాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నవారికి అండగా నిలవడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని స్పష్టం చేశారు.

ఈ పథకం ప్రారంభం సందర్భంగా తాను శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని బుడగట్లపాలెం గ్రామాన్ని సందర్శించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అక్కడ మత్స్యకార సోదరులతో నేరుగా మాట్లాడి వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నానని వివరించారు. ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలా మేలు చేసే కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఆ కష్టజీవులతో గడిపిన సమయం, రాష్ట్ర ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేయాలనే తన సంకల్పాన్ని మరింత దృఢపరిచిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Chandrababu Naidu
Andhra Pradesh
fishermen
financial aid
fishing ban
welfare scheme
election promise
government initiative
AP fishermen scheme
20000 rupees aid

More Telugu News