Ullintala Jeevan: ముఖ్యమంత్రికి లేఖ రాసి... చెట్టుకు వేలాడుతూ యువకుడి నిరసన!

Youths Desperate Protest Hanging from a Tree Over Land Issue
  • రంగారెడ్డి జిల్లాలో భూ సమస్యపై యువకుడి వినూత్న నిరసన
  • పత్రాలున్నా వారసత్వ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని ఆవేదన
  • ఏడాదిగా వందకు పైగా అర్జీలు, అధికారుల స్పందన శూన్యం
  • చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ న్యాయం కోసం విజ్ఞప్తి
  • సీఎంఓకు బహిరంగ లేఖ, 'ఎక్స్'లో వీడియో వైరల్
తన భూమి సమస్య పరిష్కారం కావడం లేదన్న ఆవేదనతో ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. వందకు పైగా వినతి పత్రాలు సమర్పించినా అధికారులు స్పందించకపోవడంతో, ఏకంగా తన భూమిలోని చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తం చేశాడు. ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసి తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

బాధితుడు వుల్లింతల జీవన్‌కు తన తండ్రి నుంచి వారసత్వంగా కొంత వ్యవసాయ భూమి సంక్రమించింది. ఈ భూమిని జీవన్ తండ్రి సుమారు 20 ఏళ్ల క్రితం మరొక వ్యక్తి నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేసి, అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు. ఈ భూమికి సంబంధించి కొత్త, పాత పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్, పహానీ పత్రాలు వంటి అన్ని రికార్డులు తమ వద్ద ఉన్నాయని జీవన్ చెబుతున్నారు.

అయితే, గతంలో జరిగిన రెవెన్యూ రికార్డుల నమోదు ప్రక్రియలో పొరపాట్ల కారణంగా, ఈ భూమి సర్వే నంబర్ సీలింగ్ పరిధిలోని భూమి సర్వే నంబర్‌లో నమోదైందని జీవన్ వాపోయారు. దీని కారణంగా ప్రస్తుతం అధికారులు ఈ భూమిని నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చారని తెలిపారు.

అసలు సీలింగ్ హోల్డర్ రెండు వేర్వేరు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఏడాది కాలంగా తాను ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని, వందకు పైగా వినతి పత్రాలు సమర్పించినా ఎటువంటి పురోగతి లేదని జీవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా పలుమార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఈ క్రమంలోనే, తన గోడును అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేసేందుకు వినూత్న నిరసనకు దిగినట్లు తెలిపారు. తన భూమిలోని వేప చెట్టుకు భూమి పత్రాలను కట్టి, అదే చెట్టుకు తాను తలకిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలను వీడియో తీసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
Ullintala Jeevan
Telangana Land Dispute
Farmer Protest
Revenue Records Error
Government Land Issue
Ibrahim Patnam
Rangareddy District
Managalpalli
Land Ceiling Act
Social Media Protest

More Telugu News