Yashaswini: తండ్రికి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బైక్ కొని.. దానిపై వెళ్తూ ప్రమాదంలో కుమార్తె మృతి

Tragic Accident Software Engineer Killed Gifting Father a Bike
  • హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యశస్విని
  • తండ్రి కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనుగోలు
  • సహోద్యోగితో కలిసి అదే బైక్‌పై స్వగ్రామానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం
తండ్రికి బహుమతిగా ఇచ్చేందుకు బైక్ కొని, దానిపై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతి చెందింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి-65పై గత అర్ధరాత్రి జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రుకు చెందిన చెడే జనార్దన్ కుమార్తె యశస్విని (24) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. తండ్రికి బైక్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్న యశస్విని ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనుగోలు చేసింది..

బైక్‌ను స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు సహోద్యోగి అయిన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన బడ్డకొండ నాగ అచ్యుత్‌కుమార్‌తో కలిసి శనివారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ నుంచి బైక్‌‌పై బయలుదేరింది. అర్ధరాత్రి 12.30 గంటలకు ఆకుపాముల చేరుకున్నారు. అక్కడ రోడ్డుపై చనిపోయి పడివున్న గేదెను గుర్తించలేక దానిని ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ యశస్వినిని ఢీకొట్టి తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన నాగఅచ్యుత్ ప్రస్తుతం కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Yashaswini
Road Accident
Suryapeta
Munugala
National Highway 65
Royal Enfield
Software Engineer
Bike Accident
Telangana
Fatal Accident

More Telugu News