Jammu and Kashmir: కశ్మీర్‌లో మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన భద్రతా బలగాలు

Indias Response to Pahalgham Attack Crackdown on Terrorists
  • బందిపొరాలో ఉగ్రవాది జమీల్ అహ్మద్ ఇంటిని పేల్చేసిన భద్రతా బలగాలు
  • శుక్రవారం నుంచి ఇప్పటి వరకు 9 మంది ఉగ్రవాదుల ఇల్లు పేల్చివేత
  • ఉగ్రవాదుల కోసం లోయలో కొనసాగుతున్న వేట
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో ఉగ్రదాడి అనంతరం ముష్కరులపై వేట ప్రారంభించిన భారత భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు చెందిన ఉగ్రవాది జమీల్ అహ్మద్ ఇంటిని పేల్చివేశాయి. ఉగ్రవాదుల ఇల్లు పేల్చివేతలో ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. జమీల్ 2016 నుంచి లష్కరేలో క్రియాశీలంగా ఉన్నాడు. గత రాత్రి త్రాల్ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జేషే మొహ్మద్ (జేఈఎం) సంబంధాలున్న ఉగ్రవాది ఆమిర్ నజీర్ ఇంటిని కూడా భద్రతా బలగాలు పేల్చివేశాయి.

ఈ తాజా ఘటనలకు ముందు రోజు కూడా ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా బలగాలు పేల్చివేశాయి. వారిలో ఒకరు 2024లో లష్కరే తాయిబాలో చేరిన షోపియాన్ జిల్లాకు చెందిన అద్నాన్ షఫీ కాగా, మరొకరు ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న ఫారూఖ్ అహ్మద్. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా బలగాలు, జిల్లా అధికారులతో కలిసి మూడు రోజులుగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి.

పహల్గామ్ ఘటనలో కీలక పాత్ర పోషించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అదిల్ హుస్సేన్ తొకర్ నివాసాన్ని శుక్రవారం బిజ్‌బెహరా ప్రాంతంలో భద్రతా బలగాలు బాంబులతో పేల్చివేశాయి. అదిల్ తొకర్ 2018లో పాకిస్థాన్‌కు చేరుకుని, అక్కడ ఉగ్రశిబిరాల్లో శిక్షణ పొందిన అనంతరం నిరుడు జమ్మూకశ్మీర్‌లోకి చొరబడ్డాడు. పహల్గామ్ లోని బైసరన్ మీడోస్‌లో 22న జరిగిన పర్యాటకులపై దాడి ఘటనలో కీలక పాత్ర పోషించినట్టు సమాచారం.

అదిల్ తొకర్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన అలీభాయ్ అలియాస్ తల్హా, ఆసిఫ్ ఫౌజీపై అనంతనాగ్ పోలీసులు రూ. 20 లక్షల రివార్డు ప్రకటించారు. భద్రతా బలగాల సమాచారం ప్రకారం.. పహల్గామ్ ఉగ్రదాడిలో ఐదారుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఈ దాడిలో ప్రధానంగా హిందువులను లక్ష్యంగా అమానుషంగా కాల్చిచంపారు.
Jammu and Kashmir
Militants
Security Forces
Terrorist attack
LeT
JeM
Adil Hussain Thoker
Jamil Ahmad
Amir Nazir
Pahalgham attack
Counter-terrorism

More Telugu News