Narendra Modi: ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ

PM Modi vows harshest response to Pahalgam terror attack assures justice for victims
  • పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తీవ్ర స్పందన
  • దాడికి పాల్పడిన వారికి, కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక
  • బాధితుల కుటుంబాలకు తప్పక న్యాయం చేస్తామని హామీ
  • కశ్మీర్‌లో శాంతి, అభివృద్ధిని చూసి శత్రువులు కుట్ర పన్నారు
  • ఉగ్రవాదంపై పోరులో దేశ ఐక్యతే కీలకమని మోదీ ఉద్ఘాటన
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ అమానవీయ చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు, దీని వెనుకున్న కుట్రదారులకు అత్యంత కఠినమైన శిక్ష తప్పదని ఆయన గట్టిగా హెచ్చరించారు. బాధితుల కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు. ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 121వ ఎపిసోడ్‌లో జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడినీ కలచివేసిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. "ఈరోజు మీతో నా మనసులోని మాట పంచుకుంటున్న వేళ, నా హృదయం తీవ్ర వేదనతో నిండి ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్ని గాయపరిచింది. బాధితుల కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడూ తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడే వారైనా, ఈ దాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారు" అని మోదీ తెలిపారు.

ఉగ్రవాద దాడి చిత్రాలను చూసిన తర్వాత ప్రతి భారతీయుడు ఆగ్రహంతో రగిలిపోతున్నాడని తాను అర్థం చేసుకోగలనని ప్రధాని అన్నారు. "ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశకు, పిరికితనానికి పహల్గామ్ దాడి అద్దం పడుతోంది" అని ఆయన పేర్కొన్నారు. 

కశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొంటున్న తరుణంలో, పాఠశాలలు, కళాశాలలు తిరిగి కళకళలాడుతున్న వేళ, అభివృద్ధి పనులు ఊపందుకున్న సమయంలో, ప్రజాస్వామ్యం బలపడుతున్నప్పుడు, పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పుడు, యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నప్పుడు.. దేశ శత్రువులకు, జమ్మూకశ్మీర్ శత్రువులకు ఇదంతా నచ్చలేదని ప్రధాని విమర్శించారు. "కశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఉగ్రవాదులు, వారి యజమానులు ఇంత పెద్ద కుట్ర పన్నారు" అని మోదీ ఆరోపించారు.

ఉగ్రవాదంపై జరుగుతున్న ఈ యుద్ధంలో 140 కోట్ల మంది భారతీయుల ఐక్యతే దేశానికి అతిపెద్ద బలమని ప్రధాని నొక్కిచెప్పారు. "ఈ ఐక్యతే ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక పోరాటానికి ఆధారం. ఈ సవాలును ఎదుర్కోవడానికి మన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. ఒక దేశంగా మనం బలమైన సంకల్ప శక్తిని ప్రదర్శించాలి. ఈ ఉగ్రదాడి తర్వాత యావత్ దేశం ఒకే గొంతుకతో మాట్లాడుతున్న విషయాన్ని నేడు ప్రపంచం గమనిస్తోంది" అని ఆయన అన్నారు.

ఈ దాడి ఘటనపై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సంతాప సందేశాలను ప్రధాని ప్రస్తావించారు. "భారతీయులమైన మనం అనుభవిస్తున్న ఆగ్రహాన్నే యావత్ ప్రపంచం కూడా అనుభవిస్తోంది. ఉగ్రదాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ నాయకుల నుంచి నాకు ఫోన్ కాల్స్, సందేశాలు అందాయి. వారంతా ఈ ఘోరమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై మన పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులతో యావత్ ప్రపంచం నిలుస్తోంది" అని మోదీ వివరించారు.

"బాధిత కుటుంబాలకు నేను మరోసారి హామీ ఇస్తున్నాను, మీకు న్యాయం జరుగుతుంది. కచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈ దాడికి పాల్పడిన వారు, కుట్రదారులు అత్యంత కఠినమైన ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
Narendra Modi
Pulwama Attack
Jammu and Kashmir
Terrorism
India
Pakistan
Kashmir Terrorism
Modi Condemns Terror Attack
National Security
Man ki Baat

More Telugu News