Iran Port Explosion: ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా

Iran Port Explosion 18 Dead And Hundreds Injured
  • ఘటనలో 18 కి చేరిన మృతుల సంఖ్య
  • మరో 750 మందికి గాయాలు
  • దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం
  • సమీపంలోని బందర్ అబ్బాస్‌లో స్కూళ్లు, ఆఫీసులు మూసివేత
ఇరాన్‌లోని అతిపెద్ద వాణిజ్య ఓడరేవు షాహిద్ రజాయీలో శనివారం సంభవించిన భారీ పేలుడు, దాని తర్వాత చెలరేగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 750 మంది గాయపడ్డారు. బలమైన గాలులు వీస్తుండటంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

పేలుడు అనంతరం పోర్ట్ పరిసర ప్రాంతాలను దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. దీంతో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బందర్ అబ్బాస్ నగరంలో పాఠశాలలు, ఆఫీసులను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హెలికాప్టర్ల ద్వారా నీటిని చల్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. పేలుడు ధాటికి పోర్టులోని అనేక భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పేలుడు శబ్దం సుమారు 50 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని వార్తా సంస్థలు నివేదించాయి.

క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదకర రసాయనాలు నిల్వ ఉంచే డిపో నుంచి మంటలు వ్యాపించినట్లు పోర్ట్ కస్టమ్స్ కార్యాలయం ప్రాథమికంగా వెల్లడించింది. అయితే, క్షిపణి ఇంధనంలో వినియోగించే సోడియం పెర్క్లోరేట్ పేలి ఉండవచ్చని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ప్స్‌తో సంబంధం ఉన్న ఓ అజ్ఞాత వ్యక్తి చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది.
Iran Port Explosion
Bandar Abbas
Shahid Rajai Port
Explosion Iran
Fire Shahid Rajai
Sodium Perchlorate
Islamic Revolutionary Guard Corps
Iran Accidents
Major Port Fire

More Telugu News