Narendra Modi: మే 2న అమరావతికి ప్రధాని మోదీ... మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమీక్ష

Chandrababu review on PM Modis Visit to Amaravati on May 2nd
  • అమరావతికి ప్రధాని మోదీ:... మే 2న పనుల పునఃప్రారంభం
  • మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
  • ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశాలు
మే 2వ తేదీన అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో... ఏపీ సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం మంత్రులు, ఉన్నతాధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు.

అమరావతి అందరి రాజధాని అని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవంలో అన్ని ప్రాంతాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అందరి రాజధానిగా అమరావతి నిర్మాణం సాగుతుందని అన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో ముందుకెళుతున్నామని చంద్రబాబు వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, అమరావతిలో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.ప్రధాని పర్యటన ఏర్పాట్లను కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. 

మోదీ మే 2న మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం చేరుకుని, హెలికాప్టర్‌లో అమరావతికి బయలుదేరతారు. సాయంత్రం 4 గంటల నుంచి జరిగే సభలో పాల్గొంటారు. ఇందుకోసం వెలగపూడి సచివాలయం వెనుక 250 ఎకరాల్లో సభాస్థలి, హెలిప్యాడ్‌లు, పార్కింగ్ సహా భారీ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 28 నాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు నియమించారు. 

మోదీ పర్యటనలో దాదాపు లక్ష కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతి పునఃప్రారంభానికి ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
Narendra Modi
Amaravati
Andhra Pradesh
Chandrababu Naidu
Modi Amaravati Visit
Amaravati Development
Foundation Stone Ceremony
AP Capital
India Politics

More Telugu News