Lavanya Lakshmi: దివ్యాంగ బాలిక లావణ్య లక్ష్మికి ఫోన్ చేసి అభినందించిన బాలకృష్ణ

Balakrishna Congratulates Disabled Girl Lavanya Lakshmi
  • పూర్తిస్థాయి దివ్యాంగురాలు లావణ్య లక్ష్మి పదో తరగతిలో ఉత్తీర్ణత
  • 345 మార్కులతో పాస్
  • గర్వపడుతున్నాను చెల్లెమ్మా అంటూ బాలయ్య హర్షం
పట్టుదలతో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన దివ్యాంగురాలిని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన లావణ్య లక్ష్మి సాధించిన విజయానికి ఆయన ఫోన్ ద్వారా ప్రశంసలు తెలిపారు.

పూర్తిస్థాయి దివ్యాంగురాలైనప్పటికీ, లావణ్య లక్ష్మి ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 345 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆమె కనబరిచిన అసాధారణ సంకల్ప బలం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

లావణ్య విజయం గురించి తెలుసుకున్న బాలకృష్ణ, ఆమెకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. "చాలా సంతోషంగా ఉందమ్మా.. నీ గురించి విని చాలా గర్వంగా ఉంది. 345 మార్కులు సాధించడం గొప్ప విషయం. నీకేమీ లోటు రాదు. భగవంతుడికి సవాల్ విసిరి ఈ ఘనత సాధించినందుకు గర్వపడుతున్నాను చెల్లెమ్మా" అంటూ బాలకృష్ణ వాత్సల్య పూరితంగా మాట్లాడారు. 

ఊహించని విధంగా బాలకృష్ణ నుంచి ఫోన్ కాల్ రావడంతో లావణ్య లక్ష్మి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "నాకు ఫోన్ చేసి అభినందించిన బాలకృష్ణ సార్‌కి ధన్యవాదాలు" అని ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

అంతకుముందు, మంత్రి నారా లోకేశ్, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ కూడా లావణ్య లక్ష్మిని అభినందించారు. ప్రస్తుతం బాలకృష్ణ, లావణ్య మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది.
Lavanya Lakshmi
Balakrishna
Nandamuri Balakrishna
Disabled Girl
10th Class Results
Andhra Pradesh
East Godavari District
Inspiration
Phone Call
Celebrities

More Telugu News