KCR: కాంగ్రెస్ పార్టీ అప్పుడూ విలనే... ఇప్పుడూ విలనే: ఎల్కతుర్తి సభలో కేసీఆర్

KCR Blasts Congress Always a Villain for Telangana
  • బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం
  • ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ
  • హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు అసలైన విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

తెలంగాణ ఉద్యమ చరిత్రను, కాంగ్రెస్ పార్టీ పాత్రను కేసీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. "తెలంగాణ హైదరాబాద్ స్టేట్‌గా ఉన్నప్పుడు, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ పార్టీ, ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ" అని కేసీఆర్ ఆరోపించారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడు, నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపిందని ఆయన విమర్శించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, టీడీపీ నేతల వైఖరిని కూడా కేసీఆర్ తప్పుబట్టారు. "ఆనాడు కాంగ్రెస్, టీడీపీలలో ఉన్న నాయకులు పదవుల కోసం పెదవులు మూశారే తప్ప, ఏనాడూ తెలంగాణ కోసం నోరు తెరిచి కొట్లాడలేదు. గులాబీ జెండా ఎగిరే వరకు కనీసం తెలంగాణ సోయిని కూడా వారు ప్రదర్శించలేకపోయారు" అని అన్నారు. బీఆర్ఎస్ బిడ్డలే తెలంగాణ కోసం పదవులను త్యాగం చేశారని, కానీ కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం తెలంగాణను ఆగం చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో 'తెలంగాణ' పదాన్నే నిషేధించారని, స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే ప్రణయ్ భాస్కర్ 'తెలంగాణ' అంటే.. దాన్ని కూడా నేరంగా పరిగణించే ప్రయత్నం జరిగిందని వివరించారు.

2001 తర్వాత తెలంగాణ ఉద్యమం పుంజుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. "మన బలాన్ని, ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి, 14 సంవత్సరాలు ఏడిపించారు. వాళ్ల మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే తప్ప దిగిరాలేదు. ప్రకటన చేసి మళ్లీ వెనక్కి వెళ్లారు. సకల జనుల సమ్మె, సాగర హారాలు, వంటా వార్పులు వంటి అనేక పోరాటాల తర్వాత, రాజకీయ అవసరాల రీత్యానే తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు" అని కేసీఆర్ అన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతిని కేసీఆర్ వివరించారు. "ప్రజలు మాకు అధికారం ఇచ్చింది అనుభవించడానికి కాదు, బాధ్యతగా తీసుకున్నాం. ఒకప్పుడు వెనుకబడిన, ఎగతాళి చేయబడ్డ ప్రాంతంగా ఉన్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. రూ. 90 వేలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని రూ. 3.50 లక్షలకు పెంచాం. జీఎస్‌డీపీలో దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపాం. అనేక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం" అని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ వేదికగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ, తమ ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు.
KCR
Congress Party
Telangana Movement
Telangana Formation
India Politics
BRS Party
K Chandrashekar Rao
Elgatur
Jawaharlal Nehru
Indira Gandhi
Chandrababu Naidu
Pranay Bhaskar

More Telugu News