KCR: ఎల్కతుర్తి సభ: రేవంత్ సర్కారుపై కేసీఆర్ విసుర్లు

KCR Attacks Revanth Reddy Govt
  • ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని కేసీఆర్ విమర్శలు
  • రుణమాఫీ, పింఛన్లు, రైతు భరోసా హామీలపై నిలదీసిన గులాబీ అధినేత
  • ఉచిత బస్సు పథకంపై వ్యంగ్యాస్త్రాలు, ప్రజలను మోసం చేశారని వ్యాఖ్య
  • 420 హామీలిచ్చి, బాండ్ పేపర్లు రాసిచ్చి నిలబెట్టుకోలేదని విమర్శ
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొన్న కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని విమర్శించారు. "ఏమేమి చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. అబ‌ద్ధాలు చెప్ప‌డంలో కాంగ్రెస్‌ వాళ్లను మించినోళ్లు లేరు" అని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రైతు బంధు కింద రూ.10,000 ఇస్తే, కాంగ్రెస్ రూ.15,000 ఇస్తామని చెప్పిందని, అలాగే పింఛన్లను రూ.2,000 నుంచి రూ.4,000కు పెంచుతామని, ఇంట్లో ఇద్దరు అర్హులుంటే ఇద్దరికీ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆరోపించారు.

దివ్యాంగులకు తమ ప్రభుత్వం రూ.4,000 పింఛన్ ఇస్తే, దానిని రూ.6,000 చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఆడపిల్లలకు స్కూటీలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా కార్డులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9న ఒకే కలంపోటుతో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి, ఇంతవరకు అమలు చేయలేదని దుయ్యబట్టారు. వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ కూడా నెరవేరలేదని విమర్శించారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టం వచ్చినా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వడంలో విఫలమైందని అన్నారు.

కల్యాణలక్ష్మి కింద తాము ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అదనంగా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, ఆ హామీ ఏమైందని కేసీఆర్ నిలదీశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు 420 హామీలు ఇచ్చారని, సిగ్గు లేకుండా బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారని, కానీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. "హామీలు ఎలా అమలు చేస్తారని అడిగితే.. చేసి చూపిస్తాం, మాది పెద్ద పార్టీ అని జబ్బలు చరిచారు. కానీ చేసి చూపించలేదు" అని కేసీఆర్ అన్నారు.

ఉచిత బస్సు పథకం వల్ల మహిళల మధ్య గొడవలు జరుగుతున్నాయే తప్ప పెద్దగా ఉపయోగం లేదని, ఆ పథకం తమకు వద్దని మహిళలే అంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పైన, తనపైన నిందలు వేస్తున్నారని, అడ్డగోలు మాటలతో ప్రజలను ఘోరంగా మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ నుంచి డూప్లికేట్ గాంధీలు కూడా వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.
KCR
Revanth Reddy
Telangana Congress
BRS
Telangana Politics
Election Promises
Free Bus Scheme
Rythu Bandhu
Pension Scheme
Kalyana Lakshmi

More Telugu News