KCR: ఈ రాత్రి మీ డైరీల్లో రాసుకోండి... మళ్లీ వచ్చేది మేమే: కేసీఆర్

KCRs Stern Warning to Telangana Police
  • ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ
  • భారీగా తరలివచ్చిన జనం
  • ఈ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
  • పోలీసుల తీరుపై ఆగ్రహం
 బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పోలీసులకు తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. తమ పార్టీ శ్రేణులపై అన్యాయంగా, అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్, ఈ సందర్భంగా పోలీసుల వ్యవహార శైలిని తప్పుబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కేసీఆర్ విమర్శించారు. "ఈ రోజు సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు సృష్టించారు? సభకు బస్సులు ఇచ్చిన ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. ఆర్టీఏ, పోలీసు అధికారులతో అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టి, ట్రాఫిక్ జామ్ చేశారు. దీనివల్ల లక్షలాది మంది హన్మకొండ, హుజూరాబాద్, సిద్దిపేట వైపు రోడ్లపైనే ఆగిపోయారు" అని కేసీఆర్ ఆరోపించారు. ఇంత కక్ష సాధింపు చర్యలా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని కేసీఆర్ నొక్కి చెప్పారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నారని, వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. "పోలీసు మిత్రులకు నేను ఒక్కటే మనవి చేస్తున్నా. మీరెందుకు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు? మీకు ఏం సంబంధం? మీ డ్యూటీ మీరు చేయండి" అంటూ పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. "ఈ రోజు రాత్రి మీ డైరీల్లో రాసి పెట్టుకోండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. అది ఎవడి తరమూ కాదు" అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

బీఆర్ఎస్ శ్రేణులపై ఎక్కడైనా అన్యాయంగా కేసులు పెడితే ఊరుకునేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీకి బలమైన లీగల్ సెల్ ఉందని, కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. "న్యాయస్థానాలు ఉన్నాయి, అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. నేను కూడా దీనిని వదిలిపెట్టను. ఎవరేంటో తేలుస్తాం" అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రకంగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.
KCR
Brs Party
Telangana Politics
Congress Government
Police Warning
Election
Telangana Police
KCR Speech
Warangal
Political Rally

More Telugu News