KCR: హైడ్రా కూల్చివేతలపై కేసీఆర్ ఫైర్

KCR Condemns Telanganas Hydra Demolition Drives
  • ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ
  • రేవంత్ సర్కారుపై కేసీఆర్ ధ్వజం
  • హైడ్రా కూల్చివేతలపై పోరాడాలని పిలుపు
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా, పేదల ఇళ్లను కూల్చివేస్తున్న 'హైడ్రా' (కూల్చివేతల బృందం) ఏర్పాటును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కూల్చివేతలపై మౌనంగా ఉండకుండా పోరాడాలని ఆయన ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

"ప్రభుత్వ స్థలాల్లో పేదలు తెలియక గుడిసెలు వేసుకుంటే, 'హైడ్రా' పేరుతో బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. గతంలో మేము చెరువుల పునరుద్ధరణకు వాడిన బుల్డోజర్లు, నేడు పేదల నివాసాలను నేలమట్టం చేస్తున్నాయి. ఇది చూస్తూ ఊరుకోవద్దు, పోరాడాలి," అని కేసీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం గతంలో లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిందని గుర్తుచేశారు.

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనక్కి పోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. "దేశంలో అగ్రస్థానంలో నిలిపిన రాష్ట్రాన్ని కిందికి తీసుకెళ్లారు. ఏడాది చూశాం, ఇక మిగిలింది రెండున్నరేళ్లే. ప్రజలు ఆవేశంతో కాకుండా ఆలోచనతో, వ్యూహాత్మకంగా పనిచేయాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి," అని సూచించారు.

ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, భూముల ధరలు పడిపోయాయని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో దాదాపు పూర్తయిన గౌరెల్లి, పాలమూరు ప్రాజెక్టుల పనులను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు.

పేదల కోసం తాము ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వంటి పథకాలను నిలిపివేయడాన్ని కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. "కేసీఆర్ కిట్ పేదల కోసం, అమ్మ ఒడి గర్భిణుల సౌకర్యం కోసం. వీటిని బంద్ చేస్తారా? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే దురుద్దేశం కనిపిస్తోంది," అని ధ్వజమెత్తారు. గతంలో తాము వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని కొనసాగించామని గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. ఈ ప్రభుత్వ తీరుపై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇక, ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులో కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. చేతిలో సైన్యం ఉందని చెప్పి యువతను, గిరిజనులను ఊచకోత కోయడం సరికాదని అన్నారు. మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలని స్పష్టం చేశారు.
KCR
Telangana Politics
Congress Government
Hydra Demolition Drives
KCR Kit
Amma Vodi
Gourellipadu Project
Palమూరు Project
Operation Kagar
Maoists

More Telugu News