Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ స‌రికొత్త చ‌రిత్ర‌

Virat Kohlis Unbeatable IPL Run 11 Seasons 400 Runs
  • ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో అద్భుత‌మైన ఫామ్‌లో కోహ్లీ
  • వ‌రుస హాఫ్ సెంచ‌రీల‌తో కదం తొక్కుతున్న స్టార్ బ్యాట‌ర్
  • ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 10 మ్యాచుల్లో 63.29 స‌గ‌టుతో 443 ప‌రుగులు
  • టోర్నీ చ‌రిత్ర‌లో 11 సీజ‌న్ల‌లో 400+ ర‌న్స్‌ చేసిన ఏకైక ఆట‌గాడిగా రికార్డ్‌
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ జోరు కొన‌సాగుతోంది. ఈ సీజ‌న్‌లో అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న ర‌న్ మెషీన్ వ‌రుస హాఫ్ సెంచ‌రీలు బాదుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడిన అత‌డు ఏకంగా 6 అర్ధ‌శ‌త‌కాలు న‌మోదు చేయ‌డం విశేషం. ఇక అత‌ని బ్యాట్ నుంచి ధారాళంగా ప‌రుగులు వ‌స్తుండ‌టం బెంగ‌ళూరు విజ‌యాల‌కు దోహ‌ద‌ప‌డుతున్నాయి. 

ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 10 మ్యాచుల్లో 63.29 స‌గ‌టుతో 443 ప‌రుగులు చేశాడు. అత్యధిక ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో కోహ్లీ స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించాడు. టోర్నీ చ‌రిత్ర‌లో 11 సీజ‌న్ల‌లో 400+ ప‌రుగులు చేసిన ఏకైక ఆట‌గాడిగా నిలిచాడు. నిజానికి, కోహ్లీకి ముందు ఏ ఆటగాడు కూడా తన కెరీర్‌లో 10 సార్లు కూడా ఈ మైలురాయిని చేరుకోలేదు.

అత‌ని త‌ర్వాతి స్థానంలో సురేశ్‌ రైనా, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ చెరో తొమ్మిదిసార్లు ఈ ఫీట్‌ను న‌మోదు చేశారు. ఆ త‌ర్వాత రోహిత్ శర్మ (8), ఏబీ డివిలియర్స్, కేఎల్ రాహుల్ (6), గౌతమ్ గంభీర్, క్రిస్ గేల్, ఫాఫ్ డు ప్లెసిస్, శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ త‌లో ఐదుసార్లు 400+ స్కోర్లు చేశారు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా కోహ్లీనే. ప్ర‌స్తుతం 8,500 పరుగుల మార్కుకు చేరువలో ఉన్నాడు. 

ఈసారి క‌ప్ బెంగ‌ళూరుదేనా?
ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ దుమ్మురేపుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచులాడి 7 విజ‌యాల‌తో టేబుల్ టాప‌ర్‌గా నిలిచింది. ప్ర‌త్య‌ర్థుల సొంత మైదానాల్లోనే వారిపై విరుచుకుప‌డుతూ మ‌రీ క‌సి తీర్చుకుంటోంది. ఆరెంజ్, ప‌ర్పుల్ క్యాప్ ఈ జ‌ట్టు వ‌ద్దే ఉన్నాయి. డీసీతో మ్యాచులో రాణించిన కోహ్లీ ఆరెంజ్ క్యాప్, హేజిల్‌వుడ్ ప‌ర్పుల్ క్యాప్ అందుకున్నారు. ఇదే ప్ర‌ద‌ర్శ‌న సీజన్ చివ‌రి వ‌ర‌కు కొన‌సాగిస్తే ఈసారి క‌ప్ త‌మ‌దేన‌ని బెంగ‌ళూరు అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.  
Virat Kohli
IPL
RCB
Royal Challengers Bangalore
Orange Cap
400+ runs
IPL 2023
Cricket
Indian Premier League
Suresh Raina
Shikhar Dhawan
David Warner

More Telugu News